
కాంగ్రెస్ యువ నాయకురాలు ప్రియాంక గాంధీ తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. తొర్రూరులో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభకు హాజరైన ప్రియాంక.. నా కోసం మీరు చాలా సేపటి నుంచి వేచి ఉన్నారు. మీ పనులు మానుకొని ఇక్కడికి వచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ ప్రభుత్వ పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి రూ. 400కే వంట గ్యాస్ ఇస్తామని తెలిపారు. మార్పు కావాలి- కాంగ్రెస్ రావాలి అన్నదే మన నినాదం అని గుర్తు చేశారు. రైతులకు రూ. 2లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు. వరిపై కనీస మద్దతు ధరతో పాటూ రూ. 500 బోనస్ ఇస్తామన్నారు.
రైతులకు ప్రతి ఏటా రూ. 15వేల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ కూలీలకు ప్రతి ఏటా రూ. 12వేలు ఇస్తామన్నారు. నిరుద్యోగులలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఉద్యోగాలు ఎక్కువగా ఇస్తున్నామన్నారు. రాజస్థాన్‌లో 2లక్షల ఉద్యోగాలిచ్చామని తెలిపారు. దేశంలోనే నిరుద్యోగుల విషయంలో తెలంగాణ అట్టడుగున ఉందని విమర్శించారు. యువత కోసం ప్రత్యేకంగా జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేస్తుంది కాంగ్రెస్ అని హామీ ఇచ్చారు. పేపర్ లీకులతో యువత ఆత్మహత్యలు చేసుకుంటోందని తెలిపారు. ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు. వీటన్నింటితో పాటూ ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామని సభావేదికగా హామీల వర్షం కురిపించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..