ఇటీవలి కాలంలో దొంగల బెడద రోజురోజుకు పెరిగిపోతోంది. పల్లె పట్నం అనే తేడా లేదు, దొంగలు చెలరేగిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాళం వేసి ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే అందరూ భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. కేవలం ఇళ్లు, వ్యాపార వాణిజ్యల్లోనే కాదు, వాహన చోరీలు కూడా పెరిగిపోతున్నాయి. ఆగివున్న వెహికిల్స్ అనువుగా కనబడితే చాలు..క్షణాల్లో మాయం చేస్తుంటారు చోర్‌గాళ్లు. అలాంటి ఓ కిలాడీ బైక్ దొంగను పట్టుకొని కటకటాల్లోకి నెడితే పోలీసులకే టోకరావేశాడు ఓ కేటుగాడు. ఏకంగా ఖాకీలు వేసిన బేడిలతోనే పోలీస్ స్టేషన్ నుంచి పరారయ్యాడు..ఇదేదో వింతగా ఉందే..లేదంటే, ఏదైనా సినిమాలో తీసిన సీన్ అని అనుకుంటున్నారేమో..కానీ కాదు కాదు.. ఇది నిజంగానే జరిగింది. ఖమ్మం జిల్లాలో ఓ దొంగ పోలీసుల కళ్లుకప్పి చాకచక్యంగా తప్పించుకున్నాడు. నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ నుంచి టూవీలర్ దొంగ గణపతి బేడీలతోనే పరారయ్యాడు..కానీ, పాపం అతని ప్రయాణం ఎంతోదూరం సాగలేదు..అంతలోనే గ్రామస్తులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పూర్తి వివరాలు పరిశీలించినట్టయితే…
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పోలీసులు బైక్ దొంగ గణపతిని అదుపులోకి తీసుకున్నారు. అతడి చేతులకు బేడీలు వేసి స్టేషన్‌కు తరలించారు. కానీ, పోలీసుల కళ్లుగప్పి అతడు బేడీలతో సహా ఎస్కేప్ అయ్యాడు. రాత్రి సమయంలో అనువైన సమయం చూసుకుని స్టేషన్ నుంచి పరారయ్యాడు. అక్కడ్నుంచి పారిపోయే క్రమంలో నాయకన్ గూడెం గ్రామం చేరుకున్నాడు. కానీ, పాపం అక్కడి స్థానికులు అతని వాలకం చూసి అదుపులోకి తీసుకున్నారు. పట్టుకుని తాళ్లతో కట్టి బంధించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తుల సమాచారం మేరకు నాయకన్ గూడెం చేరుకున్న పోలీసులు బైకుల దొంగ గణపతిని మరోమారు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పారిపోదామనుకున్న అతడి ప్లాన్ బెడిసికొట్టింది. ఎక్కడ్నుంచి తప్పించుకున్నాడో తిరిగి అక్కడికే వచ్చి పడ్డాడు.