మగువలు మెచ్చే పట్టుచీరలకు నిలయం.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి పట్టు చీరలకు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి కేరాఫ్ అడ్రస్. పోచంపల్లి చేనేత కార్మికుల నైపుణ్యానికి ప్రతీక. ఇక్కడి కంచి పట్టుచీరలు, చేనేత కార్మికుల సృజనాత్మకత, నూతన డిజైన్లతో చేనేత వస్త్రాల తయారీతో పర్యాటక ప్రాంతంగా మారింది. ఇక్కడ జరిగే సదస్సులో పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. రాష్ట్రపతి పర్యటన కోసం జిల్లా అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది.
శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్నారు. కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ 20వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో జరిగే థీమ్ పెవిలియన్ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు. ఇక్కడ చేనేత వస్త్ర కళానైపుణ్యాన్ని స్వయంగా తిలకించనున్నారు. పోచంపల్లిలోని చేనేత గృహాలను సందర్శించి కార్మికుల ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం సంత్ కబీర్, పద్మశ్రీ జాతీయ అవార్డులు పొందిన వారు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 16 మంది ఉన్నారని, ఇందులో ఎంపిక చేసిన పది మంది చేనేత కళాకారులు రాష్ట్రపతితో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.
తెలంగాణ హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్స్ ఆధ్వర్యంలో తెలంగాణ ఔనత్యాన్ని ప్రతిబింబించేలా ప్రదర్శన ఉంటుంది. తెలంగాణ చేనేత వస్త్రాలు గొల్లభామ, పోచంపల్లి ఇకత్ వస్త్రాలు, నారాయణపేట, గద్వాల వస్ర్తాలు, పుట్టపాక తెలియా రుమాలు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రదర్శనలో నాలుగు మగ్గాలపై తెలియా రుమాలు, పోచంపల్లి ట్రెడిషనల్, డబుల్ ఇకత్, పోచంపల్లి లేటెస్ట్ వస్త్రాలను నేసేలా ఏర్పాటు చేశారు.
మగువల మనసు దోచే చీరల్లో పోచంపల్లి పట్టు చీరకు ప్రత్యేక స్థానం ఉంది. దేశవిదేశాల్లో పోచంపల్లి వస్త్రాలు, డిజైన్ల పట్ల మగువలు ఎక్కువ ఆసక్తిని కనబరచడంతో పోచంపల్లి వస్త్రాలు ఖండాంతర ఖ్యాతిని ఆర్జించాయి. చేనేత సంప్రదాయక వృత్తి నైపుణ్యాలు, విశిష్టతను గుర్తించిన ‘డబ్ల్యూటీవో’ పోచంపల్లి డిజైన్లకు 2003లో పేటెంట్ హక్కు కల్పించింది. చేనేత ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి కావడంతో చేనేత కార్మికుల ప్రతిభకు విశ్వవ్యాప్త గుర్తింపు లభించింది. పదేళ్ల కాలపరిమితి గల పేటెంట్ హక్కు ఇటీవల మళ్లీ పునరుద్ధరించారు.
గ్రామీణ పర్యాటక కేంద్రంలోని వినోభా మందిరాన్ని సందర్శించి భూధానోద్యమకారులైన ఆచార్య వినోబాభావే, భూదాత వెదిరె రామచంద్రారెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం వినోభాబావే మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భూదానోద్యమ చరిత్రను తెలిపే ఫొటో గ్యాలరీని తిలకిస్తారు రాష్ట్రపతి.
హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలీకాఫ్టర్లలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భూదాన్ పోచంపల్లి చేరుకుంటారు. ఇందుకోసం మూడు ఇండియన్ ఆర్మీ హెలీకాఫ్టర్లను వినియోగిస్తున్నారు. భూదాన్ పోచంపల్లికి చేరుకున్న రాష్ట్రపతికి అధికారులు ప్రత్యేకంగా స్వాగతం పలకనున్నారు. హెలిప్యాడ్ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 20 కార్ల కాన్వాయ్‌లో టూరిజం సెంటర్‌కు చేరుకుంటారు రాష్ట్రపతి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన కోసం అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…