Telangana: వైష్ణవి ఎంత కొట్టినా తలుపు తెరవలేదు.. అనుమానమొచ్చి కిటికీలో నుంచి చూడగా..

ప్రేమించి పెళ్లి చేసుకుంటే నూరేళ్లు తోడుంటాడనుకుంది.. కానీ ఆ ఎనిమిది నెలల బంధమే ఆమె పాలిట శాపమైంది. పుట్టబోయే బిడ్డతో కలిసి కొత్త లోకాన్ని చూడాలనుకున్న ఆ ఇల్లాలు.. భర్త చేతిలోనే బలయ్యింది. ఒకేసారి రెండు ప్రాణాలు గాలిలో కలిసిపోయిన ఈ హృదయ విదారక ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. అసలేం జరిగిందంటే..?

Telangana: వైష్ణవి ఎంత కొట్టినా తలుపు తెరవలేదు.. అనుమానమొచ్చి కిటికీలో నుంచి చూడగా..
Pregnant Woman Killed By Husband

Edited By:

Updated on: Mar 17, 2026 | 11:45 AM

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ఏడడుగుల బంధం ఏడెనిమిది నెలలు కూడా గడవకముందే ఆ కిరాతకుడు భార్య పాలిట కాలయముడయ్యాడు. ఐదు నెలల గర్భవతి అని కూడా చూడకుండా పుట్టబోయే బిడ్డతో సహా భార్యను ప్రాణాల్ని గాలిలో కలిపేసిన హృదయ విదారక ఘటన జగిత్యాల జిల్లాలో వెలుగుచూసింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి, కోరుట్లకు చెందిన హరిబాబు గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఎనిమిది నెలల క్రితం పెద్దలను ఒప్పించి ఘనంగా వివాహం చేసుకున్నారు. కొత్త జీవితం సాఫీగా సాగుతుందనుకున్న తరుణంలో వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. చిన్నపాటి విభేదాలు చిలికి చిలికి గాలివానలా మారి నిత్యం గొడవలకు దారితీశాయి.

రక్తసిక్తమైన సోమవారం రాత్రి

సోమవారం రాత్రి భార్యాభర్తల మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన హరిబాబు.. వైష్ణవిపై దాడి చేసి అత్యంత దారుణంగా హతమార్చాడు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు గదిలోకి వెళ్లి చూసేసరికి వైష్ణవి అపస్మారక స్థితిలో పడి ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. వైష్ణవి ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి. ఇంట్లో వెలుగులు నింపాల్సిన పసిబిడ్డ, లోకం చూడకముందే తండ్రి చేతిలోనే ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలచివేస్తోంది. వైష్ణవి మరణం మాదాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

నిందితుడు పరార్.. పోలీసుల గాలింపు

ఘటన జరిగిన వెంటనే నిందితుడు హరిబాబు అక్కడి నుంచి పరారయ్యాడు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి, దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడే ఇలా ప్రాణాలు తీయడంతో “ప్రేమంటే ప్రాణాలు తీయడమా?” అంటూ బాధితురాలి బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Follow Us