రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఫోస్ట్ ఆఫీస్ మేనేజర్ ఏకంగా 140 మంది రైతులను నిండా ముంచాడు. ఒకటి కాదు, రెండు కాదు మూడు కోట్ల రూపాయలపైగా పత్తి డబ్బులను సొంత ఖాతాలోకి మళ్లించుకుని పరారయ్యాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.
పోస్టాపీస్ లో ఉన్న రైతుల జాబ్ కార్డ్ ఖాతాల్లో జమ అయిన లక్షల రూపాయలను మాయం చేశాడు ఆదిలాబాద్ జిల్లా పోస్ట్ ఆఫీస్ మేనేజర్ విజయ్ జాదవ్. జాబ్ కార్డ్ లో జమ అయిన సీసీఐ పత్తి కొనుగోళ్ల డబ్బులను డ్రా చేసుకునేందుకు రోజుకు 10 వేల వరకు మాత్రమే అనుమతిఉంటుంది. కానీ పోస్ట్ ఆఫీస్ మేనేజర్ తన చేతివాటాన్ని ప్రదర్శించి రైతులఖాతాల్లో ఉన్న లక్షల రూపాయలనుఅప్పన్నంగా మాయం చేశాడు.
ఆదిలాబాద్ సీసీఐకి పత్తి విక్రయించిన వందల మంది రైతుల ఆధార్ అనుసంధానం ఉన్న జాబ్ కార్డు ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. ఆ ఖాతా నుంచి రోజుకు రూ.10 వేలకు మించి నగదు తీసుకునే వీలు లేదు. ఇదే అదునుగా బావించిన ఆదిలాబాద్ పోస్ట్ ఆఫీస్ మేనేజర్ విజయ్ జాదవ్, రైతులను బురిడి కొట్టించి వారి ఖాతాల నుండి డబ్బులు మాయం చేశాడు. పోస్ట్ ఆఫీస్ అకౌంటెంట్ ఐడిని వినియోగించి రైతుల ఖాతాల నుండి డబ్బునంతా తన ఖాతాలోకి ట్రాన్సపర్ చేసుకున్నాడు. డబ్బులు ఎప్పుడు వస్తాయని ప్రశ్నించిన రైతులకు మాయమాటలు చెపుతూ వచ్చిన సదరు మేనేజర్ తన టార్గెట్ పూర్తవగానే మాయమయ్యాడు. తాజాగా ఆదిలాబాద్ పోస్ట్ ఆపీస్ లో మూడు కోట్ల రూపాయల స్కాం జిల్లాలో కలకలం రేపుతోంది.
పోస్ట్ ఆఫీస్ ఖాతా నుండి బ్యాంకు పొదుపు ఖాతాల్లో డబ్బులు ట్రాన్సపర్ చేసుకోవడానికి ఆదిలాబాద్ లోని ప్రధాన శాఖకు నాలుగు నెలలుగా ఆదిలాబాద్ రూరల్ మండలంలోని తాంసి, తలమడుగు, భీంపూర్, జైనథ్, బేల మండలాల రైతులు వెళుతున్నారు. ఇక్కడే ఓ అధికారి తన వక్రబుద్ధిని చూపాడు. ఆదిలాబాద్ మండలానికి చెందిన రైతులు అత్యవసరం కోసం డబ్బులు డ్రా చేసుకున్నారు. అయితే ఇక్కడే అసలు మాయ చేశాడు మేనేజర్. రైతుల పర్సనల్ అకౌంట్లలోకి కాకుండా తన అకౌంట్ లోకి నెప్ట్ రూపంలో డబ్బులు డ్రా చేసుకున్నాడు. ఒక్కో రైతునుండి రూ. 20 వేలు డ్రా చేయగా మిగిలిన డబ్బులను మొత్తంగా తన అకౌంట్లలోకి నెప్ట్ చేసుకున్నాడు పోస్ట్ ఆఫీస్ మేనేజర్ విజయ్ జాదవ్.
పోస్టాఫీసు ఖాతా నుంచి రైతుల సొంత బ్యాంక్ అకౌంట్ కు డబ్బులు డ్రా చేయాలంటే ఓటీపీ సాయంతోగానీ, బయోమెట్రిక్ విధానంలోగానీ చెల్లించే వెసులుబాటు ఉంది. అమాయక రైతుల నుంచి వేలిముద్రలు సేకరించిన పోస్ట్ ఆఫీస్ మేనేజర్ విజయ్ జాదవ్ రైతులకు తెలియకుండానే వారి ఖాతాలోని డబ్బులను తన సొంత ఖాతాలోకి మళ్లించుకున్నాడు. డబ్బులు పడలేదని రైతులు మేనేజర్ ను ప్రశ్నిస్తే.. రేపు, మాపు అంటూ తిప్పించుకున్న మేనేజర్ తీరా తన టార్గెట్ పూర్తవగానే పరారయ్యాడు.
ఆదిలాబాద్ మండలం బుర్నూర్ కు చెందిన మునిగెల సురేష్ అనే రైతుకు పోస్ట్ ఆఫీస్ మేనేజర్ విజయ్ తన ఖాతా నుంచి నేరుగా సురేష్ ఖాతాకు రూ.1.60 లక్షలు జమ చేశాడు. వాస్తవంగా పోస్టాఫీసు ఖాతా నుంచి డబ్బులు జమ చేయాల్సింది పోయి సదరు అధికారి సొంత ఖాతా నుంచి డబ్బులు ట్రాన్ఫర్ చేయడంతో అనుమానం వచ్చిన అదే గ్రామానికి చెందిన ఇరవై మంది రైతులు నిలదీశారు. అందరి డబ్బులు ఒకట్రెండు రోజుల్లో చెల్లిస్తానని బుకాయించాడు.
తీరా నాలుగు రోజులు నుండి పోస్ట్ ఆఫీస్ కు రాకపోవడం తో అనుమానం వచ్చిన రైతులు మేనేజర్ ని ఫోన్ లో నిలదీశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పోస్ట్ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు. ఒక్క బుర్నూర్ గ్రామ రైతులే కాదు ఆదిలాబాద్, జైనథ్, ఆదిలాబాద్ రూరల్ మండలంలోని 32 గ్రామాలకు చెందిన రెండు వందల మంది రైతుల నుండి రెండు కోట్ల కు పైగా డబ్బులు మాయం చేసినట్టు తేలింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..