
దేశంలో పాత తరం రాజకీయం అంతరించిపోయిందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఇప్పుడంతా మోడ్రన్ రాజకీయం నడుస్తోందన్నారు. మరోవైపు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ సమ్మిట్ సక్సెస్ అయిందన్నారు.
హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు నిర్వహించిన భారత్ సమ్మిట్ ముగిసింది. రెండో రోజు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సమాజంలోని అన్ని వర్గాల ఆకాంక్షలు నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ అన్నారు. ఇందు కోసం అనేక పథకాలను తీసుకొచ్చామన్నారు. దేశంలోనే అతిపెద్ద రైతు రుణమాఫీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేలు ఇస్తున్నామన్నారు. వరికి మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇస్తున్నామని వివరించారు. యువత కోసం రాజీవ్ యువ వికాసం పథకం తీసుకొచ్చామన్నారు. ప్రజలకు ఏ సమయంలో ఏది అవసరమో కాంగ్రెస్‌కు బాగా తెలుసన్నారు. అలాగే దావోస్, అమెరికా, జపాన్ సహా పలు దేశాల్లో పర్యటించి 2.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించామన్నారు. దీని ద్వారా యువతకు ఉద్యోగాలు రానున్నాయి. తెలంగాణలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం రేవంత్.
ప్రపంచవ్యాప్తంగా రాజకీయాలు ఎంతో మారిపోయాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. పదేళ్ల క్రితం ఉన్న రాజకీయాలకు ఇప్పటికీ ఎంతో తేడా ఉందన్నారు. పాతతరం రాజకీయం అంతరించిపోయిందని, ఇప్పుదంతా మోడ్రన్ రాజకీయం నడుస్తోందని తెలిపారు. చట్టసభల్లో విపక్షాలకు మాట్లాడే అవకాశం రావడం లేదన్నారు రాహుల్. విపక్ష పార్టీలు ప్రపంచవ్యాప్తంగా అణిచివేతను ఎదుర్కొంటున్నాయన్న రాహుల్.. విపక్షాల వాదన వినిపించేందుకుకొత్త వేదికలు వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పుడు సమస్యల పరిష్కారానికి ప్రజలే మార్గం చూపిస్తున్నారని.. నేతలు కూడా ఆ మార్గంలోనే నడవాలని సూచించారు.
రెండు రోజులపాటు జరిగిన ఈ సమ్మిట్‌లో పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు, విదేశీ ప్రతినిధులు హాజయ్యారు. బహుళత్వం, వైవిద్యం, పోలరైజేషన్‌ను అధిగమించడం, వేగవంతమైన న్యాయం, అనిశ్చితి కాలంలో ఆర్థిక న్యాయం, న్యాయం, ప్రపంచ శాంతిపై సదస్సులో చర్చలు జరిగాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..