16వ శతాబ్దం నాటి బాహుబలి… విప్లవ యోధుడు… సర్దార్ పాపన్న గౌడ్. 400 ఏళ్లు దాటినా.. ఆయన పేరు తెలంగాణాలో మారుమోగిపోతోంది. ముఖ్యంగా రాజకీయపార్టీల గుండెల్లో ఆయనెప్పటికీ నిలిచే ఉంటారు… ఉంటున్నారు. జయంతి సందర్భంగా తెలంగాణాలోని పార్టీలన్నీ పాపన్న జపం పఠిస్తున్నాయి. తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీక అంటూ కీర్తికిరీటం తొడిగారు సీఎం కేసీఆర్. ఇంతకీ ఎవరీ పాపన్న గౌడ్… చరిత్రలో ఆయన పేరు ఎందుకంత స్థిరంగా నిలబడిపోయింది?
సర్వాయి పాపన్న గౌడ్… కేరాఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ తాలూకా బెల్గాం. 1650 ఆగస్టు 18న పుట్టిన పాపన్న.. పాతికేళ్ల వయసుకే విప్లవ వీరుడిగా మారాడు. ప్రజాకంటక పాలనకు వ్యతిరేకంగా శంఖం పూరించాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని పోగొట్టుకుని.. లేలేత వయసులోనే అభ్యుదయ భావాలతో రెబలిస్టిక్ అప్రోచ్‌తో ఉండేవాడని చరిత్ర చెబుతోంది. మొగలాయిల దురాగతాల్ని భరించలేక… దగాపడ్డ సామాన్యుల్ని చేరదీసి దండుగా తయారు చేసి స్వరాజ్య స్థాపన కోసం పోరాడాడు.. గడీలను కొల్లగొట్టి పేదలకు పంచిపెట్టాడు… సర్దార్ పాపన్న.
జమీందార్లు, పెత్తందార్లు, జాగీర్‌దార్లు, భూస్వాములు, మదమెక్కిన ధనిక వర్గాలకు వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగరేసిన పాపన్న… కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్వాసిపేట నుంచి రాజ్యస్థాపనకు ఉపక్రమించాడు. ఎత్తయిన కోటను నిర్మించుకుని.. తనదైన పోరాటాన్ని సాగించాడు. గెరిల్లా సైన్యంతో మొఘల్ చక్రవర్తుల దురాగతాల్ని ఎదిరించిన వీరుడు.. తన పరాక్రమంతో వరంగల్ కోటను, గోల్కొండ కోటను జయించిన ధీరుడు పాపన్న గౌడ్.
373వ జయంతి సందర్భంగా లండన్ విక్టోరియా మహల్ మ్యూజియంలో ఉన్న పాపన్న ప్రతిమ లాంటిదే సర్వాయి పాపన్న గుట్టలపై ఆవిష్కరించారు. ఏటా పాపన్న జయంతి. వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. అన్ని రాజకీయ పార్టీల కార్యాలయాల్లో పాపన్నకు నివాళి అర్పించారు.
సబ్బండ వర్ణాలకు స్పూర్తిప్రదాత అని, పేదోళ్లు గుండెల్లో పెట్టుకుని పూజించే రారాజు అని పాపన్నగౌడ్‌ని ఆకాశానికెత్తేస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. 4 శతాబ్దాల కిందటి పాపన్న చరిత్రను తవ్వి కొత్త జెనరేషన్లకు గుర్తు చేస్తున్నారు నేతలు.
సర్దార్ సర్వాయి పాపన్న ఉమ్మడి వరంగల్ జిల్లా.. ప్రస్తుత జనగామ జిల్లా, రఘనాథపల్లి మండలం, ఖిలాషాపూర్ గ్రామంలో జన్మించినట్లుగా చరిత్ర చెబుతోంది. తండ్రి పేరు నాసగోని ధర్మన్నగౌడ్. చుట్టు పక్కల గ్రామస్తులు గౌరవంతో ధర్మన్నదొర పిలుచుకునేవారు. తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో.. సర్వమ్మ అతడి తల్లి.. అందరు అతన్ని పాపన్న గౌడ్ అని పాపన్న దొర అన్ని పిలిచేవారు. పాపన్న ఎల్లమ్మ తల్లితోపాటు మహా శివుడిని కూడా ఆరాధించేవారు. తల్లి కోరిక మేరకు గౌడ వృత్తిని స్వీకరించాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..