తెలంగాణ రాజకీయాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది మునుగోడు. ఒక ఉప ఎన్నికతో మునుగోడు దేశ వ్యాప్తంగానే వార్తల్లో నిలిచింది. గతంలో సొంత నియోజకవర్గ ఎమ్మెల్యే దర్శనం కావాలంటేనే గగనం అనిపించే ఇక్కడి ప్రజలకు ఇప్పుడు మంత్రులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా అందుబాటులో ఉంటూ.. మీకు మేమున్నామంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఇప్పటివరకు తమను పట్టించుకోని వారంతా ఓట్ల కోసం తమ చెంతకు వస్తున్నారనే అభిప్రాయంతో ఓటర్లంతా ఉన్నారు. అన్ని పార్టీల నాయకులు క్షేత్రస్థాయిలో ప్రతి ఓటరును స్వయంగా కలిసి ఓట్లు అభ్యర్థిస్తుంటే.. ఓటరు కూడా మీకే మా ఓటు అంటూ హామీ ఇచ్చేస్తున్నాడు. కాని మనసులో మాటను మాత్రం బయటపెట్టడం లేదు. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ కు మరో ఆరు రోజుల సమయం మాత్రమే ఉంది. దీంటో అభ్యర్థుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓటరు నాడి బయటపడకపోవడంతో సామాన్య మునుగోడు ప్రజానీకం ఏమి ఆలోచిస్తోందనే పార్టీలకు అంతుపట్టడం లేదు. మునుగోడు ఉప ఎన్నికకు అన్ని రాజకీయ పార్టీలు హైప్ క్రియేట్ చేయడంతో ఓటర్లు కూడా భారీ అంచనాలతో ఉన్నారు. తమ అంచనాలను కొందరు బహిరంగంగానే ప్రస్తావిస్తుండటంతో అభ్యర్థులు ఏమి చేయాలో తోచక తలలు పట్టుకుంటున్నారు.
ఓటర్ల నాడిని పట్టుకోవడం సర్వే సంస్థలకు కూడా ఇబ్బందిగానే మారింది. ఒకవేళ తమ అభిప్రాయాన్ని బహిరంగపరిస్తే వేరే పార్టీల నుంచి తమపై ఒత్తిడితో పాటు.. ఇతర పార్టీల నుంచి వచ్చే తాయిలాలు ఏమైనా ఇవ్వబోరేమో అనే అనుమానం చాలామందిలో నెలకొంది. కాని కొంతమంది మాత్రం తమ మద్దతు ఎవరికి అనేదానిపై బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. నియోజకవర్గంలో అన్ని పార్టీలకు ఎంతో కొంత ఓటు బ్యాంకు ఉంది. అయితే తెలంగాణలోని అధికార టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలకు క్షేత్రస్థాయిలో సంప్రాదాయ ఓటు బ్యాంకు ఉంది. బీజేపీతో పాటు ఇతర పార్టీలకు కొంతమేర ఉన్నప్పటికి అది గెలుపునకు అవసరమయ్యే స్థాయిలో లేదు. అయితే కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ నే కమలం పార్టీ నమ్ముకుంది. క్షేత్రస్థాయిలో టీఆర్ ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీతో పాటు, బీఎస్పీ, టీజెఎస్, ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు సైతం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఏ నాయకుడు పర్యటించినా వారి వెనుక జనం మాత్రం ఉంటున్నారు. దీంతో అసలు ఓటరు తన ఓటును పోలింగ్ రోజున ఎవరికి వేస్తారనేది మాత్రం అంతుచిక్కని ప్రశ్నగా మారిపోయింది.
మునుగోడు ఉప ఎన్నిక విజయాన్ని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీజేపీ నుంచి కేంద్రహోమంత్రి అమిత్ షా, టీఆర్ ఎస్ నుంచి సీఏం కేసీఆర్, కాంగ్రెస్ నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేరుగా ఈ ఎన్నిక పర్యవేక్షణ బాధ్యతలను తీసుకున్నారనే ప్రచారం కూడా ఎప్పటినుంచో జరుగుతోంది. అయితే మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఫలితం వచ్చినా బాధ్యత తనదేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగంగానే చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనావేసిన తర్వాత మాత్రమే ఆయన ఈ విధమైన ప్రకటన చేసి ఉండవచ్చనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. వాస్తవపరిస్థితి ఎలా ఉన్నా రేవంత్ రెడ్డి ఇలాంటి ప్రకటన చేయడంతో మిగతాపార్టీల అభ్యర్థులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో ప్రచారం మాత్రం మరింత ఊపందుకుంది. ఇప్పటికే అన్ని పార్టీలు నియోజకవర్గంలోని ప్రతి ఓటరును కలిసి ఓట్లు అభ్యర్థించాయి. ఇక ఎన్నికల ప్రచారానికి మూడు రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఎవరి వ్యూహాలతో వారు ముందుకెళ్తున్నారు. ఏది ఏమైనప్పటికి మునుగోడు ఫలితం ప్రభావం వచ్చే శాసనసభ ఎన్నికలపై ఉంటుందనే చర్చ నేపథ్యంలో ఇక్కడి గెలుపును అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో మునుగోడులో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇక్కడ గెలిచేది ఎవరు తెలియాలంటే నవంబర్ 6వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..