కాకరేపుతోన్న కరీంనగర్ పాలిటిక్స్.. ఒకేరోజు ఇద్దరూ.. తూర్పున సీఎం రేవంత్.. పశ్చిమాన మాజీ సీఎం కేసీఆర్..!

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికగా తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఏప్రిల్ 20వ తేదీన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరూ ఒకే జిల్లాలో పర్యటిస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. కరీంనగర్ తూర్పున రేవంత్ రెడ్డి పర్యటన ఉంటే, పశ్చిమ దిశలో కేసీఆర్ సభ ఖరారైంది.

కాకరేపుతోన్న కరీంనగర్ పాలిటిక్స్.. ఒకేరోజు ఇద్దరూ..  తూర్పున సీఎం రేవంత్.. పశ్చిమాన మాజీ సీఎం కేసీఆర్..!
Cm Revanth Reddy And Former Cm Kcr

Updated on: Apr 16, 2026 | 8:25 PM

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికగా తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఏప్రిల్ 20వ తేదీన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరూ ఒకే జిల్లాలో పర్యటిస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. కరీంనగర్ తూర్పున రేవంత్ రెడ్డి పర్యటన ఉంటే, పశ్చిమ దిశలో కేసీఆర్ సభ ఖరారైంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ సాగనుంది. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిపోయిన ఏడో బ్లాక్ పిల్లర్లను ఆయన స్వయంగా పరిశీలించనున్నారు. అనంతరం ఇరిగేషన్ అధికారులతో క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించి, వర్షాకాలం లోపే యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సిన మరమ్మతులపై దిశానిర్దేశం చేయనున్నారు. సీఎం పర్యటనలో భాగంగా కాటారం మండలం నస్తూరుపల్లి వద్ద భారీ ‘ప్రజాపాలన’ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఇందుకోసం కాంగ్రెస్ శ్రేణులు 40 ఎకరాల్లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇరిగేషన్ వైఫల్యాలపై రేవంత్ రెడ్డి ఈ వేదికగా విరుచుకుపడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

మరోవైపు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా కాలం తర్వాత బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. జగిత్యాలలో బీఆర్ఎస్ నిర్వహించే ఈ సభకు భారీ ప్రాధాన్యత ఉంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి గులాబీ గూటికి చేరుతున్న తరుణంలో, కేసీఆర్ తన ప్రసంగం ద్వారా క్యాడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని చూస్తున్నారు. దాదాపు లక్ష మందిని సమీకరించే లక్ష్యంతో బీఆర్ఎస్ నేతలు నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జిలను నియమించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ పాల్గొంటున్న తొలి భారీ బహిరంగ సభ ఇదే కావడంతో, ప్రస్తుత కాంగ్రెస్ పాలనపై ఆయన ఎలాంటి విమర్శలు చేస్తారనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఒకరు ప్రాజెక్టు వైఫల్యాలను ఎత్తిచూపేందుకు వస్తుంటే, మరొకరు రాజకీయ పునరేకీకరణ లక్ష్యంగా రంగంలోకి దిగుతున్నారు. ఒకేరోజు, ఒకే జిల్లాలో ఇద్దరు అగ్రనేతల పర్యటనలు ఉండటంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. మొత్తానికి ఏప్రిల్ 20న తెలంగాణ రాజకీయ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లానే అని చెప్పవచ్చు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us