
హైదరాబాద్, మార్చి 3: హత్యలు, దొంగతనాలు, దోపిడీలు ఏ కేసులోనైనా కొంతమంది నేరగాళ్ల ఆచూకీ నెలలు గడుస్తున్న ఆచూకీ మాత్రం లభించడం లేదు. ఘటన జరిగిన తర్వాత పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ఎంత ప్రయత్నించినా వారి కంట పడకుండా తప్పించుకు తిరుగుతున్నారు. అటు పోలీసులు కూడా కొత్త కేసులు వచ్చిన తర్వాత పాత కేసులను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఘటన జరిగినటువంటి ప్రాంతంలో వేలిముద్రలు వంటి కీలక ఆధారాలను సేకరిస్తున్నప్పటికీ.. నెలలు గడుస్తున్న నిందితుల ఆచూకీ లేకపోవడంతో ఆ కేసులు మరుగున పడుతున్నాయి. ఇందుకు తాజాగా నగరంలో జరిగినటు వంటి కొన్ని కీలక కేసులే ఉదాహరణ..
కర్ణాటకలోని బీదర్‌లో ఇద్దరూ కరుడుగట్టిన నేరస్తులు రూ.93 లక్షల డబ్బులను ఏటీఎం నుంచి చోరీ చేశారు. చోరీ సమయంలో తుపాకీతో కాల్పులు జరపగా ఒక వ్యక్తి మృతి చెందాడు. ఇదే ఘటనలో మరో వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ తర్వాత హైదరాబాదులోని అఫ్జల్‌గంజ్‌కు వచ్చినటువంటి ఇద్దరు నేరస్తులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. ఈ కేసులో పోలీసులు కంటపడకుండా దుండగులు వేషాలను మార్చుకొని చెన్నైకి పారిపోయారు. కనీసం ఇప్పటివరకు వాళ్ల ఆచూకీ కనిపించినటువంటి పరిస్థితి లేదు. సుమారు 45 రోజులు గడుస్తున్న నేరస్తులు ఎక్కడున్నారో కనిపెట్టలేకపోయారు పోలీసులు.
ఇక మరోవైపు గత ఏడాది అక్టోబర్‌లో అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి డీడీ కాలనీలో వృద్ధ దంపతులను గుర్తు తెలియనటువంటి వ్యక్తులు దారుణంగా కొట్టి హత్య చేశారు. ఆ జంట హత్యల వెనుక ఉన్నటువంటి మిస్టరీ ఇప్పటికీ విడలేదు. అంతేకాకుండా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బ్రిడ్జి కింద గుర్తు తెలియని మృతదేహం లభ్యం అయింది. ఆ కేసులోనూ కొన్ని వందల సీసీ కెమెరాలను పరిశీలించినా.. ఇప్పటివరకు హత్య చేసిన నిందితులు ఎవరో కనిపెట్టలేకపోయారు పోలీసులు.. టెక్నాలజీ విషయంలో దేశంలోనే ముందున్నటువంటి తెలంగాణ పోలీసులు.. కీలకమైన కేసుల్లో నేరస్తులను పట్టుకోవడంలో విఫలమవుతున్నారు. ఆ తర్వాత కొత్త కేసులు నమోదవుతుంటే పాత కేసులో ఈ రకంగా మరుగున పడుతున్నాయి. ఇదే అదనుగా నేరస్తులు కొత్త వేషంతో దర్జాగా తిరుగుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.