Telangana: ఈ ఖాకీల్లో కఠినత్వమే కాదు.. మనసులో మానవత్వం కూడా ఎక్కువే..
పోలీస్ అంటే నేరస్థులపై ఉక్కుపాదం.. చట్టం ముందు రాజీలేని తీరు, కఠిన నిర్ణయాలు అని మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ అదే ఖాకీ చొక్కా వెనున మానవత్వంతో ఆలోచించే మనసు కూడా ఉంటుందనే విషయం మరోసారి రుజువైంది.తోటి ఉద్యోగి శాశ్వతంగా దూరం అవ్వడం ఎస్సైలను కదిలించింది. ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో.. ఒంటరైన ఫ్యామిలీకి అండగా నిలిచేందుకు రెండు రాష్ట్రాల ఖాకీలు ఒక్కటయ్యారు. అందరూ కలిసి ఆ ఫ్యామిలీకి భరోసా నిలిచారు.

క్యాన్సర్ బారీన పడి ప్రాణాలు కోల్పోయిన సహ ఉద్యోగి ఫ్యామిలీకి అండగా నిలిచి గొప్ప మనస్సు చాటుకున్నారు రెండు తెలుగురాష్ట్రాల పోలీసులు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామానికి చెందిన జి. వెంకటనారాయణ.. 2014లో ఎస్సైగా ఎంపికై తెలంగాణ పోలీసు శాఖలో సేవలు ప్రారంభించారు. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసిన ఆయన కీసర పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తుండగానే క్యాన్సర్ బారిన పడ్డారు. నెలల తరబడి ప్రాణాంతక వ్యాధితో పోరాడిన ఆయన.. చివరకు ఈ ఏడాది మే 19న కన్నుమూశారు.
వెంకటనారాయణ మరణంతో భార్య, ఇద్దరు చిన్నారులు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగి పోయారు. కుటుంబ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్- తెలంగాణ 2014 బ్యాచ్‌కు చెందిన ఎస్సైలు అందరూ స్పందించారు. ఎవరి ఆదేశం లేదు, ఎవరి ఒత్తిడి లేదు.. కేవలం మానవత్వమే వారిని ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. క్యాన్సర్‌తో కన్నుమూసిన సహచరుడి కుటుంబ భవిష్యత్తు కోసం బ్యాచ్ మేట్స్ అందరూ చేతులు కలిపారు. అతడి కుటుంబం ఒంటరిగా కాకూడదనే ఒక్క ఆలోచనతో 746 మంది ఎస్సైలు స్వచ్ఛందంగా విరాళాలు అందించారు.
ఒక్కొక్కరి చేయూత కలసి.. రూ.25 లక్షల సహాయంగా మారింది. బేతవోలులో వెంకట నారాయణ ఇద్దరు కుమారులకు చెరో రూ.10 లక్షల చొప్పున. మొత్తం రూ.20 లక్షలు, ఆయన వృద్ధ తల్లిదండ్రులకు రూ.5 లక్షల చెక్కును అందజేశారు. సహచరుడి కుటుంబానికి ధైర్యం చెబుతూ.. మీరు ఒంటరివారు కాదు, మేమంతా మీ కుటుంబమే అనే సందేశాన్ని ఇచ్చారు. ఆ క్షణం అక్కడున్న ప్రతి ఒక్కరి కళ్లలో భావోద్వేగం కనిపించింది. ఆ ఫ్యామిలీ తమ పక్కన కొండత అండ ఉందనే ధైర్యం కలిగింది. తొడబుట్టిన వారే ఎలా పోతే మనకేముందిలే అనుకునే వ్యక్తులు ఉన్న ఈ రోజుల్లో కలిసి పనిచేసిన సహ ఉద్యోగి కోసం పోలీసులఅందరూ ఏకమవడం పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
