జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నేర నియంత్రణలో వారి మార్క్ చూపాల్సిన ఖాకీలు వరుస వివాదాలతో కటకటాల పాలవుతున్నారు. నేరాలను అరికట్టాల్సిన రక్షక భటులే శిక్షార్హులవుతున్నారు. పోలీసు శాఖ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలో వరుసగా చోటుచేసుకుటున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. లైంగింక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో పోక్సో కేసులో ఇరుక్కున్న సీఐ కటకటాల పాలయ్యాడు. ఆ సీఐ అరెస్ట్ చర్చనీయాంశంగా మారగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ అరెస్ట్ కావడం కలకలం రేపింది. భూపాలపల్లి జిల్లా పోలీస్ శాఖలో విధుల్లో చేరిన కొద్ది రోజుల వ్యవధిలోనే ఈ పోలీసు అధికారులు వివాదాల్లో చిక్కుకొని కటకటాల పాలయ్యారు.
గతంలో హనుమకొండలోని కాకతీయ యునివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఎస్.ఐ గా విధులు నిర్వహించిన సంపత్ సీఐగా ప్రమోషన్ పొందిన తర్వాత భూపాలపల్లి జిల్లాలో పనిచేస్తున్నారు. వీఆర్ విభాగంలో పని చేస్తున్న సీఐ సంపత్ లైంగిక ఆరోపణల్లో పోక్సో చట్టం కింద కేసు నమోదై కటకటాల్లోకి వెళ్లారు. ఆ మహిళతో సహజీవనం చేస్తు ఆమె కూతురును లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.సీఐ సంపత్ అరెస్ట్ వ్యవహారం తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ ఘటన పోలీస్ శాఖలో చర్చగా మారగా తాజాగా ఇదే జిల్లా పోలీసుశాఖలో ఓ.ఎస్.డిగా పనిచేస్తున్న భుజంగరావు అరెస్ట్ సంచలనం రేకెత్తిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంబంధం ఉన్నట్లు గుర్తించిన విచారణ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పర్చారు. అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారితో పాటు, సీఐ వివిధ కేసుల్లో ఇరుక్కొని జైలు పాలవడం చర్చగా మారింది. ఇరువురు అధికారులు భూపాలపల్లి జిల్లాలో విధుల్లో చేరిన కొద్ది రోజులకే వివాదాలు చుట్టుముట్టడం పోలీసుశాఖకు మాయని మచ్చగా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..