తెలంగాణలో అధునాతన సౌకర్యాలతో అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు.. వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ!

దేశంలోని రైల్వే ప్రయాణీకులకు అంతర్జాతీయ ప్రమాణాలు, ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం అమృత్ భారత్. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా నిర్మించిన 103 కొత్త అమృత్‌ భారత్‌ రైల్వే స్టేషన్లను గురువారం ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.

తెలంగాణలో అధునాతన సౌకర్యాలతో అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు.. వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ!
Kishan Reddy Pm Modi

Updated on: May 21, 2025 | 9:09 PM

దేశంలో రోజురోజుకు ట్రైన్‌లలో ప్రయాణిస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది. దీంతో ప్రయాణికులకు కొత్త మౌళిక సదుపాయాల కల్పనతో పాటు, నూతన ప్రయాణసౌకర్యాల కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు రైల్‌లో ప్రయాణించే ప్రయాణికులకు ప్రపంచ స్థాయి ఉత్తమ సేవలను అందించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే దేశంలోని రైల్వే స్టేషన్‌ల పునరుద్ధరించడానికి “అమృత్ భారత్ స్టేషన్” అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 1,300 రైల్వే స్టేషన్లను రూ.1 లక్ష కోట్ల అంచనా వ్యయంతో పునరాభివృద్ధి చేస్తోంది. అయితే ఇప్పటికే దేశవ్యాప్తంగా 103 రైల్వే స్టేషన్‌లను రైల్వే శాఖ నిర్మించింది. వీటిని గురువారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.

అయితే, అమృత్‌ భారత్‌ పథకం కింద తెలంగాణలోనూ 40 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. అందులో మూడు రైల్వే స్టేషన్‌ల నిర్మాణాలను పూర్తి చేసింది. బేగంపేట్, వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్లను పునరుద్ధరించిన రైల్వే శాఖ.. ఎయిర్ పోర్టులను తలపించేలా వాటి రూపురేఖలను తీర్చిదిద్దింది. ఈ క్రమంలోనే ఈ మూడు రైల్వే స్టేషన్‌లను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉదయం 9 గంటలకు వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. కాగా బేగంపేట రైల్వే స్టేషన్‌లో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి హాజరు కానున్నారు.

అయితే, రాబోయే 30-40 సంవత్సరాల వరకు ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ రైల్వేస్టేషన్‌లను రైల్వేశాఖ తీర్చిదిద్దింది. ప్రయాణీకులకు అంతర్జాతీయ ప్రమాణాలు, ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించే లక్ష్యంతో ఎయిర్‌ పోర్టులను తలపించేలా వాటి రూపురేఖలను మార్చేసింది. రూ.2,750 కోట్లు నిధులతో తెలంగాణ వ్యాప్తంగా సుమారు 40 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి కేంద్ర చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అధునాతన సౌకర్యాలతో చర్లపల్లి రైల్వే స్టేషన్ ఇప్పటికే ప్రయాణికులకు అందుబాటులోకి రాగా..గురువారం మరో మూడు రైల్వే స్టేషన్‌లు కూడా ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..