
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తుక్కుగూడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పింఛన్‌దారులకు, ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి వేతనాలు, పింఛన్ అందడం లేదన్నారు. అభివృద్ధి అంటే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలకు గిట్టదు, రెండు పార్టీల నేతలు మోదీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. బీజేపీ అన్ని వర్గాలను సమానంగా చూస్తుందని.. కాంగ్రెస్ అవినీతి పాలనను కేసీఆర్ కొనసాగించారంటూ విమర్శించారు. ఇరిగేషన్ స్కీములను ఇరిగేషన్ స్కామ్‌లుగా మార్చారంటూ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సామాజిక వర్గాలను ఈ రెండు పార్టీలు అన్యాయం చేశాయంటూ మండిపడ్డారు. ఓబీసీలను కాంగ్రెస్ దారుణంగా అవమానించడమే కాకుండా.. బీసీలను కాంగ్రెస్ నేతలు దొంగలంటున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతల గర్వాన్ని, అహంకారాన్ని అణచాలని పిలుపునిచ్చారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్ మాట తప్పారంటూ విమర్శించారు.
తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే తొలిసారిగా బీసీలకు సీఎంగా అవకాశం కల్పిస్తామన్నారు. బీజేపీ మాటతప్పదు.. ఇది తన హామీ అంటూ ప్రత్యేకంగా హామీ ఇచ్చారు నరేంద్ర మోదీ. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని.. తెలంగాణలో తమకు అధికారమిస్తే మాదిగ సామాజిక వర్గానికి న్యాయం చేస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణకు కమిటీ వేస్తున్నాం సుప్రీంకోర్టులో మాదిగ సామాజిక వర్గం తరపున న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం రోడ్ మ్యాప్ తయారవుతోందని వివరించారు. యువతకు ఉపాధి కల్పిస్తామని బీఆర్ఎస్ అవినీతిని పారదోలాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీజేపీపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయన్నారు ప్రధాని మోదీ. కాంగ్రెస్‌కు వేసే ప్రతి ఓటుతో బీఆర్ఎస్‌కు లబ్ధి చేకూరుతుందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దళితులకు, బీసీలకు చేసిందేమీ లేదని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేశారని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణలో బీజేపీ పాలనపై నమ్మకం పెరుగుతోందన్నారు. బీఆర్ఎస్‌ను ఓడించే సత్తా బీజేపీకే ఉందని చెప్పుకొచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..