Phone tapping probe: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ కీలక నిర్ణయం

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గుట్టు విప్పేందుకు దర్యాప్తును నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్తోంది సిట్‌. నిందితులను ప్రశ్నించడంతోపాటు బాధితుల వాంగ్మూలాలు కూడా రికార్డు చేస్తోంది. అదే సమయంలో కీలక నిర్ణయాల దిశగా అడుగులేస్తోంది. ప్రభాకర్‌రావు వ్యవహరంలో సిట్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు రెడీ అయింది.

Phone tapping probe: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ కీలక నిర్ణయం
Phone Tapping Probe

Edited By:

Updated on: Jun 19, 2025 | 9:20 PM

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్ కేసులో తవ్వే కొద్దీ కొత్తకొత్త విషయాలు… విచారణ లోతుకు వెళ్లే కొద్దీ సరికొత్త అంశాలు వెలుగులోకొస్తున్నాయి. ఈ కేసులో ఏ1గా ఉన్న ప్రభాకర్‌రావును ఇప్పటికే మూడుసార్లు ప్రశ్నించిన అధికారులు…ఆయన నుంచి సరైన సమాధానం లేకపోవడంతో ఇవాళ నాలుగోసారి కూడా విచారించారు. పదుల సంఖ్యలో ప్రశ్నలు సంధించారు. అయితే ప్రభాకర్‌రావు వ్యవహారంలో సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిట్ సిద్ధమవుతోంది. ప్రభాకర్‌రావుకు రిలీఫ్‌ రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరనుంది. మరోవైపు కస్టోడియల్‌ విచారణ కోసం నాంపల్లి కోర్టులోనూ పిటిషన్‌ వేసే అవకాశం కనిపిస్తోంది.

ట్యాపింగ్‌ కేసులో నిన్నటికి నిన్న సస్పెండెడ్‌ డీఎస్పీ ప్రణీత్‌రావునూ విచారించారు అధికారులు. ఎన్నికల ముందు ఎస్ఐబీలో స్పెషల్ ఆపరేషన్ టార్గెట్‌ను ప్రణీత్ రావు లీడ్ చేయడంతో పాటు రాజకీయ నేతలు, ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు గుర్తించిన అధికారులు… పలు ఆధారాలను ఆయన ముందుంచి ప్రశ్నించారు. అయితే ప్రణీత్‌రావు పలు కీలక డాక్యుమెంట్లు అధికారులకు సమర్పించినట్లు తెలుస్తోంది. మరోవైపు బాధితుల వాగ్మూలాలను రికార్డ్‌ చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తో పాటు మరో 20మంది వరకు సాక్షులు తమ వాంగ్మూలాలను ఇచ్చారు. మొత్తంగా… అమెరికా నుంచి ప్రభాకర్‌రావు వచ్చాక స్పీడ్‌ పెంచిన సిట్‌ అధికారులు… ఎలా ముందుకెళ్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.