Telangana: మేమూ ఫోన్‌ ట్యాపింగ్‌ బాధితులమే.. తెలంగాణ రాజకీయాల్లో రచ్చ రచ్చ..

|

Mar 27, 2024 | 11:43 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంది. తామూ బాధితులమేనంటూ నాయకులంతా బయటకొస్తున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై సెన్సేషనల్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. అసలు సూత్రధారుల పాత్రను బయట పెట్టాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ట్యాపింగ్‌పై బీజేపీ నేతలు బాంబులు పేలుస్తుంటే... కాంగ్రెస్‌ నాయకులు డీజీపీ ఆఫీస్‌కి క్యూ కట్టారు.

Telangana: మేమూ ఫోన్‌ ట్యాపింగ్‌ బాధితులమే.. తెలంగాణ రాజకీయాల్లో రచ్చ రచ్చ..
Phone Tapping Case
Follow us on

రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో… తామూ బాధితులమేనంటూ రాజకీయ నాయకులు బయటకు రావడంతో కేసు మరింత సీరియస్‌గా మారింది. ఇక ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ నేత రఘునందన్‌రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ ఏర్పడ్డాక ఫోన్‌ ట్యాపింగ్ తొలి బాధితుడు రేవంతే కదా.. మరి అధికారులను ఆయన ఎందుకు క్షమిస్తున్నారని ఫైర్‌ అయ్యారు. సీఎం రేవంత్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు.. గవర్నమెంట్‌కు ఫోన్ ట్యాపింగ్‌పై దర్యాప్తు చేసే చిత్తశుద్ధి ఉందా.. లేదా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రఘునందన్‌రావు. అధికారులను రేవంత్ రెడ్డి ఎందుకు క్షమిస్తున్నారు..? డీజీపీకి అటాచ్ అయిన శ్రీనాథ్‌రెడ్డి ఎవరు…? రిటైర్ అయ్యాక డీజీపీ మహేందర్ రెడ్డి ఎక్కడున్నారు..? ఇద్దరు అధికారులను అమెరికాకు పంపింది ఎవరు..? మరికొందర్ని కూడా కేసులో నుంచి తప్పిస్తున్నారా..? ట్యాపింగ్ పరికరాలు ఎప్పుడు, ఎంతకు కొన్నారు..? దుబ్బాక ఉప ఎన్నికప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరగలేదా..? అలాగే మునుగోడు బైపోల్‌ టైమ్‌లో ఫోన్లు ట్యాప్‌ చేయలేదా..? అసలు మార్చి 19న ఒకే ఫ్లైట్‌లో రేవంత్-హరీష్‌రావు ఏం మాట్లాడుకున్నారు..? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ నిప్పులు కక్కారు రఘునందన్‌రావు. దర్యాప్తు మరింత ముమ్మురం చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సైతం ఫోన్‌ ట్యాపింగ్‌పై మండిపడ్డారు. త్వరగా న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. విచారణ పూర్తిచేసి అందరి పేర్లు బయటపెట్టాలని.. కోరారు.

డీజీపీని కలిసిన కాంగ్రెస్ నేతలు..

ఫోన్‌ ట్యాపింగ్‌పై కాంగ్రెస్‌ నేతలు సైతం సీరియస్‌గానే ఉన్నారు. తామూ బాధితులమేనంటూ ఓ స్టెప్‌ ముందుకేసి డీజీపీని కలిశారు. విచారణ పరిధిని పెంచాలంటూ డీజీపీని కలిసి వినతి పత్రం అందజేశారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి. తనతో పాటు మరెంతో మంది కాంగ్రెస్‌ నాయకులు ఈ ట్యాపింగ్‌ బారిన పడ్డారని వాపోయారు.

మొత్తంగా.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు రాజకీయంగానూ రచ్చ లేపుతోంది. బీజేపీతో పాటు అధికార నేతలు సైతం తామూ బాధితులమేనంటూ బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..