తెలంగాణలో నకిలీ విత్తనాల విక్రయదారులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని తద్వారా పీ.డి చట్టం పెట్టనున్నట్టు డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టే అంశంపై శనివారం సాయంత్రం రేంజ్ ఐజీలు, పోలీస్ కమీషనర్లు, ఎస్.పీ లతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. అడిషనల్ డీజీ జితేందర్, ఐజీలు ప్రభాకర్ రావు, నాగిరెడ్డి, రాజేష్ కుమార్ లు కూడా పాల్గొన్న ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిజిపి మాట్లాడుతూ…రాష్ట్రంలో నకిలీ విత్తనాల విక్రయాలను ఉక్కుపాదంతో అణచివేయాలని కోరారు. ఈ నకిలీ విత్తనాల బెడదను రాష్ట్రంలో పూర్తిగా నిర్మూలించేందుకు పోలీసు శాఖ, వ్యవసాయ శాఖ సంయుక్తంగా కృషిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆదేశించిన విషయాన్ని డిజిపి ప్రస్థావించారు. ఈ నకిలీ విత్తనాల వ్యాపారులను గుర్తించి వారిపై పిడి చట్టం కేసులు నమోదుచేసి, నకిలీ విత్తనాల బెడదను తప్పించి ఉత్తమ ఫలితాలు సాధించిన పోలీసు అధికారులకు తగు ప్రోత్సాహకాలను ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారని డిజిపి తెలియజేశారు. రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా నకిలీ విత్తనాలు విక్రయించి అరెస్ట్ అయినవారి వివరాలు, నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులు, పంట నష్టం, విక్రయదారుల సమాచారాన్ని సేకరించి వాటిపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. ఈ అంశంపై రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి వ్యవసాయ శాఖ సహకారంతో విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా నకిలీ విత్తనాల తయారీదారులు, వారి మార్కెటింగ్, స్థానిక నెట్ వర్క్ తదితర వివరాల నిర్వహణ విధానాన్ని (మోడస్ ఆపరెండీ) రూపొందించి తగు కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. వెంటనే సంబంధిత జిల్లా, డివిజన్, మండల స్థాయిలో అధీకృత, గుర్తింపు పొందిన విత్తన విక్రయదారులు, డీలర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని తెలిపారు.
నకిలీ విత్తనాల విక్రయదారులకు సంబంధించిన సమాచారాన్ని పోలీసు శాఖకు అందించాలని విత్తన కంపెనీలు, డీలర్లను కోరాలని సూచించారు. ఈ అంశంపై ఏర్పాటుచేసే పోలీస్ నోడల్ అధికారులు తప్పనిసరిగా టాస్క్ పోర్స్ విభాగం నుండే ఉండాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఏవి నకిలీ విత్తనాలు, ఏవి సరైన విత్తనాలు, వాటిని గుర్తించే విధానంపై పోలీసు అధికారులకు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. గత సంవత్సరం రాష్ట్రంలో 104 మంది నకిలీ విత్తన విక్రయదారులపై కేసులు నమోదు చేశామని తెలిపారు. ప్రధానంగా పత్తి, మిరప విత్తనాల్లో అధికంగా నకిలీవి ఉంటాయని, మన రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా నకిలీ విత్తనాలపై కఠినంగా వ్యవహరించడంతో ఇతర రాష్ట్రాల్లో నకిలీ విత్తనాలను తయారుచేసి రాష్ట్రంలో అక్రమంగా విక్రయిస్తున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న జిల్లాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి వాటిని నిరోధించడంలో కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
Also Read: తెలంగాణలో కొత్తగా 2,982 కరోనా కేసులు, యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా
బిర్యానీ ఆర్డర్ సరిగ్గా ఇవ్వలేదంటూ కేటీఆర్‌ను ట్యాగ్ చేసిన నెటిజన్.. మంత్రి రిప్లై భలే ఫన్నీ