Vanama Raghava Issue: కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్ కేసు తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. బాధిత కుటుంబం ఆత్మహత్యకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కుమారుడు వనమా రాఘవేందర్ రావు కారణమన్న ఆరోపణలు పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. ఎమ్మెల్యే కొడుకు అయి ఉండి.. ఇంత నీచానికి పాల్పడుతాడా? అంటూ విమర్శల వర్షం కురుస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకున్న విపక్షాలు.. ఏకంగా ఎమ్మెల్యే రాజీనామాకు డిమాండ్ చేస్తున్నాయి.
‘‘వనమా.. ఇది తగునా? సాయం చేయమని అడిగితే.. భార్యను పంపమంటావా? ఆస్తి వివాదం పరిష్కరించమని కోరితే.. అడ్డగోలు డిమాండ్‌లు పెడతారా? ప్రజా జీవితంలో ఉండి.. అదే ప్రజల మాన ప్రాణాలతో ఆడుకుంటారా?’’ వనమా రాఘవేందర్‌రావు S/o ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అకృత్యాలపై పోటెత్తుతున్న ఆరోపణలు ఇవి. ఆరోపణలు మాత్రమే కాదు.. మరణ వాంగ్మూలం కూడా. ఆత్మహత్య చేసుకున్నది ఒక్కరు, ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు. బాధితుడు రామకృష్ణ, ఆయన భార్య.. ఇద్దరు కూతుళ్లు. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను ఊపేస్తోంది.
ఆయనో ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తి. అంతకు మించి ఏకంగా ఎమ్మెల్యే కుమారుడు. తండ్రి, కొడుకుల ఆస్తి వివాదాన్ని తేల్చమని వనమా రాఘవేందర్ రావు దగ్గరకు వెళ్లారు. సమస్య పరిష్కారం అవుతుందని ఆశించిన రామకృష్ణకు ఊహించని అనుభవం ఎదురైంది. పిల్లలు లేకుండా భార్యతో హైదరాబాద్ రావాలన్నది రామకృష్ణకు రాఘదేందర్ రావు అల్టిమేటమ్. భార్యను పంపాలన్నది ఆయన కోరిక. అస్తి తగాదా సంగతేమో గాని అంతు చిక్కను ఆజ్ఞలతో రామకృష్ణ కుంగి, కుషించిపోయాడు. మానసికంగా తీవ్ర మనోవేదకు గురయ్యాడు. ఏం చేయాలో తెలియక, తననే నమ్మి వచ్చిన భార్య, అల్లారు ముద్దుగా పెంచుకున్న ఇద్దరు కూతళ్లతో ఆత్మహత్య చేసుకున్నాడు. తమకు తాము పెట్రోల్ పోసుకొని సజీవదాహనం చేసుకున్నారు. దీనికి ముందు బాధిత రామకృష్ణ సూసైడ్ లెటర్, వీడియో విడుదల చేశాడు.
ఈ ఘటనతో రామకృష్ణ భార్య శ్రీలక్ష్మి పుట్టింటి వారు షాక్‌కు గురయ్యారు. తన అక్క, బావ సహా పిల్లల చావుకు కారణమంటూ రామకృష్ణ తల్లి సూర్యవతి, అక్క మాధవితో పాటు..రాఘవేందర్ రావు లపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు బావమరిది జనార్ధన్. వారిపై ఫిర్యాదు చేయడంతో తనను బెదిరిస్తున్నారంటూ జనార్ధన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఇదిలాఉంటే.. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ‘‘ఇదొక తల్లి, కొడుకుకు సంబంధించిన ఆస్తి వివాదం. పరిష్కరించమని అడిగితే.. దారుణమైన కండిషన్స్ పెట్టాడు ఎమ్మెల్యే కుమారుడు. ఈస్థాయిలో ఉన్న వ్యక్తి ఇంత దారుణానికి ఒడిగట్టవచ్చా? సమాజంలో అసలేం జరుగుతోంది? ఎవరికైనా కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలి? తమ చావుకు అతనే కారణం, ఎలా కారణం అయ్యాడో వివరిస్తూ.. బాధితుడు సూసైడ్ లెటర్, సెల్పీ వీడియో ఉన్నా చర్యలు తీసుకోరా? నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలి’’ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సహా ఇతర కాంగ్రెస్ నేతలు ఈ వ్యవహారంపై సీరియస్ అవుతున్నారు. మరోవైపు బీజేపీ నేతలు కూడా ఈ వ్యవహారంలో ప్రభుత్వా్న్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యే వనామా నాగేశ్వరరావు తన పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
రాఘవ అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు..
ఒక్కటా, రెండా. రాఘవేందర్ రావు అకృత్యాలు. ఈ ఒక్కడ ఘటనతో గతంలో చోటు చేసుకున్న ఘటనలు మరోసారి చర్చనీయ అంశంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వనమా వెంకటేశ్వర రావు.. అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నప్పటి నుంచి రాఘవేందర్ అరాచకాలకు హద్దులేకుండా పోయిందన్న ఆరోపణలున్నాయి. గతంలో పాల్వంచ ఎస్ఐ, ఆ తర్వాత మలిపెద్ది వెంకటేశ్వర్లు, ఇప్పుడు రామకృష్ణ ఎపిసోడ్‌లో అన్ని వేళ్లు రాఘవేందర్ రావు వైపే చూపుతున్నాయి. రామకృష్ణ ఎపిసోడ్‌లో రాఘవేందర్‌పై ఉన్న అనుమానాలకు సాక్ష్యాలు తోడవ్వడంతో అతన్ని ఈ కేసులో A2గా చేర్చారు పోలీసులు. ఇప్పటికీ అజ్ఞాతంలో ఉన్న రాఘవేంద్రను పోలీసులు ఎప్పుడు పట్టుకుంటారనేది వేచి చూడాలి.
Also read:
Siri-Srihan: ఇన్‌స్టాలో సిరి ఫోటోలను డెలిట్ చేసిన శ్రీహాన్.. బ్రేకప్ దిశగా లవ్ బర్డ్స్ ? ..
Vastu Tips: పిల్లలు చదువుకునే సమయంలో ఏకాగ్రత పెరగాలంటే స్టడీ రూమ్‌కి ఈ రంగులను ఎంచుకోండి..