Itlu Mee Niyojakavargam: అధికార పార్టీలో ఆధిపత్యపోరు.. నిజామబాద్‌ రూరల్‌లో కారు ఓవర్‌ లోడ్‌.. కాంగ్రెస్‌కు కలిసొస్తుందా.. కమలం వికసిస్తుందా..

|

Mar 16, 2023 | 1:21 PM

నిజామాబాద్ రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం.... జిల్లా లోనే అతిపెద్ద నియోజ‌క‌వ‌ర్గం...ఉద్దండులు పోటి చేసిన నియోజ‌క‌వ‌ర్గం..అక్క‌డి నుండి రెండు సార్లు వ‌రుస‌గా గెలిచి ఇప్పుడు హ్య‌ట్రిక్ కోసం రెడి అవుతుంది అధికార పార్టీ..కాని ఈ సారి ఎలాగైన వ‌రుస గెలుపుల‌కు క‌ల్లెం వేయాల‌ని ఎత్తులు వేస్తున్నాయి ప్ర‌తిప‌క్షాలు...టికేట్ కోసం అటు అధికార పార్టీతో పాటు, ఇటు ప్రతిపక్షాల్లోను తీవ్ర పోటి నెలకోంది..

Itlu Mee Niyojakavargam: అధికార పార్టీలో ఆధిపత్యపోరు.. నిజామబాద్‌ రూరల్‌లో కారు ఓవర్‌ లోడ్‌.. కాంగ్రెస్‌కు కలిసొస్తుందా.. కమలం వికసిస్తుందా..
Nizamabad
Follow us on

2009లో కొత్తగా ఏర్పడిన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో.. రాజకీయం అదో టైపుగా ఉందిప్పుడు. ప్రస్తుతం అధికార బీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్‌…. మరోసారి పోటీకి సై అంటున్నారు. అయితే, సొంత పార్టీలోనే ఆయనకు కుంపటి మొదలైనట్టు తెలుస్తోంది. గత ఎన్నికల తర్వాత ఇబ్బడి ముబ్బడిగా ప్రత్యర్థిపార్టీల నేతలు వచ్చేయడంతో కారు ఓవర్‌లోడ్‌ కావడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. 2019ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన మండవ వెంకటేశ్వర్రావు… కాంగ్రెస్‌ నుంచి వచ్చిన ఆకులలలిత… సీనియర్ నేత అరికెల నర్సారెడ్డి… ఈసారి రూరల్‌ టిక్కెట్‌ దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 2009లో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన మండవ.. మరోసారి ఎన్నికలబరిలో నిలవానే ఉత్సాహంతో ఉన్నారు. ఆయన నివాసానికి స్వయంగా సీఎం కేసీఆర్‌ వెళ్లడం అప్పట్లో రాజకీయసంచలనమైంది. దాన్ని బేస్‌ చేసుకుని.. ఆయన ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయన్నది చర్చనీయాంశంగా మారింది.

2014కు ముందు వైఎస్‌ఆర్పీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన గోవర్ధన్‌… రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన డి. శ్రీనివాస్‌ను ఓడించారు. అయితే, ఆ తర్వాత రాజకీయాలు మారిపోయాయ్‌. డీఎస్‌ కూడా గులాబీ కండువా కప్పేసుకుని రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత, మళ్లీ గులాబీ కండువాను పక్కనపెట్టేశారు. ఇది, స్థానిక రాజకీయాల్లో పెను మార్పులకు కారణమైందనే వాదన ఉంది. ఉద్యమ సమయం నుంచీ పార్టీలో ఉన్న స్థానిక నేత భూపతిరెడ్డిని కాదని.. 2014లో గోవర్దన్‌కు సీటిచ్చింది బీఆర్‌ఎస్‌. అలకబూనిన భూపతిరెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి శాంతపరిచింది. అయితే, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య అస్సలు పొసగలేదు. ఇద్దరి మధ్యా వార్‌… దాడులు చేసుకునేదాకా వెళ్లింది. దీంతో, 2018కి ముందు భూపతిరెడ్డిని సస్పెండ్‌ చేసింది గులాబీ అధిష్టానం. కోపంతో కాంగ్రెస్‌లోకి దూకిన భూపతిరెడ్డి.. బాజిరెడ్డిగోవర్దన్‌పై పోటీకి దిగారు. అయినా సరే, కేసీఆర్‌ వేవ్‌లో.. బాజిరెడ్డినే విజయం వరించింది. మరి, ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందన్నదే ఆసక్తిరేపుతోంది. కేసీఆర్, సిట్టింగ్‌కు ఛాన్సిస్తారా? కొత్త వ్యక్తిని బరిలో నిలిపి ప్రయోగం చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. అధికార పార్టీలో చేరిన వలసనేతలంతా ఇప్పుడు అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నవేళ అధిష్టానం నిర్ణయం కీలకం కానుంది.

డీఎస్‌ సైడైయ్యాక హస్తం అస్తవ్యస్థం!

ఇక, కాంగ్రెస్‌ కథ వేరేలా ఉంది. డీఎస్‌ సైడైయ్యాక ఇక్కడ హస్తం పార్టీని నాయకత్వలేమి వెంటాడుతోంది. 2018లో బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన భూపతిరెడ్డి పోటీచేసినా గెలుపు దక్కలేదు. ఈసారి కూడా ఆయనే బరిలో ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. మరి ఈ దఫా అయినా సింపతీ పనిచేస్తుందా? పాత ఫలితమే పునరావృతమవుతుందా? అనేది అర్థంకాని పరిస్థితి. జిల్లాలో బీజేపీ యాక్టివ్‌గా కనిపిస్తున్నా… బలమైన లీడర్‌ లేకపోవడంతో.. ఇక్కడ అంతంతమాత్రమే అన్నట్టుగా ఉంది పరిస్థితి. పోటీచేసేందుకు క్యాండిడేట్‌ కూడా కనిపించడం లేదు. దీంతో వచ్చేసారి సైతం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల మధ్యే ప్రధాన పోటీ ఉండనుందని స్పష్టమవుతోంది.

2లక్షల ఓట్లు.. బీసీల ప్రాబల్యమే ఎక్కువ

నిజామబాద్‌ రూరల్ నియోజక వర్గంలో లో మొత్తం రెండు లక్షల దాకా ఓటర్లున్నారు. ఐదు మండలాల ఈ సెగ్మెంట్‌లో.. బీసీల ప్రాబల్యం ఎక్కువ. ఓసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలు సైతం.. భారీ సంఖ్యలోనే ఉన్నా… బీసీల్లో భాగమైన మున్నూరు కాపు ఓట్లే ఇక్కడ కీలకం. వరుస ఎన్నికల్లో గెలుపొందిన బాజిరెడ్డి గోవర్దన్‌కు.. మున్నురుకాపులే అండగా నిలిచారన్న అభిప్రాయం లోకల్‌ పాలిటిక్స్‌లో ఉంది. మరి, వచ్చేసారి వాళ్లు ఎవరి పక్షం వహిస్తారన్నదే.. గెలుపోటములను నిర్దేశించనుంది.

పూర్తికాని కాలేశ్వరం ప్యాకేజీ పనులు

పొలిటికల్‌ పొటెన్షియల్‌ పక్కనపెడితే.. నియోజకవర్గంలో అభివృద్ధి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు… వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న ప్యాకేజీపనుల విషయంలో రైతులనుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. మంచిప్ప రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని 1.5 టీఎంసీల నుంచి 3.5టీఎంసీలకు పెంచడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికోసం 1336 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉండగా… పరిహారం విషయంలోనే రైతులు ఆందోళన చెందుతున్నారు.

మంచిప్ప రిజర్వాయర్‌ వల్ల… పలు గ్రామాలు, తండాలు నీటమునిగిపోనున్నాయి. దీంతో, పుట్టిన ఊరును విడిచి ఎక్కడికి వెళ్లాలని అడుగుతున్నారు స్థానికులు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే గోవర్దన్‌ స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి హామీనీ నెరవేర్చామంటున్న అధికార పార్టీ

ఎన్నికలకు ముందు నియోజకవర్గప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశామన్నది అధికార పార్టీ మాట. ప్ర‌తి గ్రామానికి రోడ్లు వేయ‌డంతో పాటు, అస్పత్రులు నిర్మించామనీ చెబుతున్నారు బీఆర్‌ఎస్ నేతలు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సాగుతున్న ఎమ్మెల్యేకు మళ్లీ పట్టం కడతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

నియోజ‌క‌వ‌ర్గంలో డ‌బుల్ బెడ్రూం ఇళ్ళు చాలాచోట్ల పూర్తి కాకపోవడం అధికార పార్టీకి మైనస్‌గా మారింది. కొన్ని చోట్ల పూర్తయినా.. మరికొన్ని చోట్ల పునాదుల దగ్గరే ఆగిపోవడంతో లబ్దిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

సమస్యల నిలయంగా తెలంగాణ యూనివర్సిటీ

నియోజకవర్గంలో కీలకంగా ఉన్న తెలంగాణ యూనివర్సిటి.. సమస్యల నిలయంగా మారింది. చేస్తున్నాయి. 100కోట్లు కేటాయిస్తామన్న ప్రభుత్వహామీ ఉట్టిమాటగానే మిగిలిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు.

ఎయిర్‌ పోర్టుకు భూసేకరణ పూర్తయ్యేదెప్పుడో!

జక్రాన్ పల్లి మండలం మనోహరబాద్ లో ఎయిర్ పోర్ట్ కోసం.. భూసేకరణ.. పరిష్కారం లేని సమస్యగానే మిగిలిపోయింది. పట్టా భూములను ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. దీంతో ఇక్కడ ఎయిర్‌పోర్టు ఏర్పాటు డైలమాలో పడింది.

నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ పునః ప్రారంభంపై రగడ

ఇన్నేళ్లలో ఏమ్మేల్యే బాజిరెడ్డి గోవర్దన్‌… చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులేవీ చేయలేదన్నది విపక్షాల ఆరోపణ. నిజాం కోపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభిస్తామని చెప్పి.. మాట తప్పారంటూ దెప్పి పొడుస్తున్నారు ప్రతిపక్ష నాయకులు.

అన్నింటికీ అభివృద్ధితోనే జవాబంటున్న ఎమ్మెల్యే

విపక్షాల ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదంటున్నారు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌. నియోజకవర్గంలో సాగు,తాగునీరు సమస్య తీరేలా మంచిప్ప, కుండం రిజర్వాయర్ పనులు పూర్తిచేసేందుకు.. కృషిచేస్తున్నామంటున్నారు. అన్ని సమస్యలకూ, ప్రతిపక్షాల ఆరోపణలకు.. అభివృద్ధితోనే సమాధానం చెబుతామంటున్నారు.

అపోజిషన్‌ అంత బలంగా ఏం లేదు. అలాగని సిట్టింగ్‌ ఎమ్మెల్యే సీదా విక్టరీ కొట్టేస్తారన్న నమ్మకమూ లేదు. ప్రత్యర్థుల కంటే.. సొంత పార్టీలో కుంపట్లే బాజిరెడ్డి గోవర్దన్‌ను భయపడేలా చేస్తున్నట్టు కనిపిస్తోంది. మరి, వీటన్నింటిని అధిగమించి గోవర్దన్‌ హ్యాట్రిక్‌ విక్టరీ కొడతారా? లేదా? అన్నదే లోకల్‌ రాజకీయాల్లో జరుగుతున్న చర్చ. మరి, జనాలు నిజామాబాద్‌ రూరల్‌లో రూలింగ్‌ ఎవరికి అప్పగిస్తారో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం