Telangana: పరీక్షల్లో తప్పానన్న మనస్తాపంతో మరో ఇంటర్‌ విద్యార్థిని సూసైడ్

|

Dec 22, 2021 | 3:42 PM

మరో ఇంటర్‌ విద్యార్థిని బలైపోయింది. పరీక్షల్లో తప్పానన్న మనస్తాపంతో సూసైడ్‌ చేసుకుంది.

Telangana: పరీక్షల్లో తప్పానన్న మనస్తాపంతో మరో ఇంటర్‌ విద్యార్థిని సూసైడ్
Inter Student Suicide
Follow us on

మరో ఇంటర్‌ విద్యార్థిని బలైపోయింది. పరీక్షల్లో తప్పానన్న మనస్తాపంతో సూసైడ్‌ చేసుకుంది. ఇంటర్‌ విద్యార్థిని నందిని హెయిర్ షాంపూ (సుఫర్ వస్మల్) తాగి ఆత్మహత్యాయత్నం చేయడంతో.. ఆమెను హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నందిని చనిపోయింది. విద్యార్థిని నందిని స్వస్థలం ఆదిలాబాద్‌గా తెలుస్తోంది.

అసలే కార్పొరేట్ కాలేజీల ర్యాంకుల గోల- ఆపై తల్లిదండ్రుల మెదళ్లలో స్థిరపడిపోయిన మార్కుల లీల..ఉన్న సమస్యలు చాలవన్నట్టు.. మధ్యలో కరోనా కరాళ నృత్యం.. ఈ కారణంగా మొదలైన ఆన్ లైన్ క్లాసులు. ఈ క్లాసుల్లో చదివింది బుర్రకు ఎక్కక కొందరు.. అసలీ క్లాసుల్లో కూడా పార్టిసిపేట్ చేయలేక మరికొందరు. ఏ కొద్ది శాతం మంది మాత్రమే.. ఎలాగోలా గట్టెక్కిన పరిస్థితి. ఈ కరోనా కాలపు ఆన్ లైన్ చదువులను అందుకోలేక.. ఫెయిల్ అయ్యామనే బాధతో.. ఆత్మహత్య చేసుకున్నారంటే.. ఆ విద్యార్ధులది ఎంత కష్టం ఎంత కష్టం.. ఎంత బాధాకరం.. ఎంత దయనీయం.

ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఫెయిలయ్యామనే ఆవేదనతో.. విద్యార్థుల వరుస ఆత్మహత్యలు.. ప్రస్తుతం ఆందోళనకరంగా మారాయి.

ఆత్మహత్యలు చేసుకున్న, సూసైడ్‌కు యత్నించిన విద్యార్థుల వివరాలు

1. నల్గొండ జిల్లా గాంధీనగర్‌కు చెందిన జాహ్నవి- ఇంటర్ ఫస్టియర్ ఫెయిల్ అయిన ఆవేదనతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది.

2. నిజామాబాద్‌కు చెందిన ధనుష్‌ ఇంటర్‌లో ఫెయిల్‌ అయ్యానన్న తీవ్ర మనస్థాపంతో.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాలయ్యాడు..

3. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకోగా.. మరొకరు సూసైడ్ అటెంప్ట్ చేసి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు..

4. జయశంకర్- భూపాలపల్లి జిల్లాలో ఇంటర్లో ఫెయిల్​ అయినందుకు మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

5. చిట్యాల మండలం, చల్లగరిగకు చెందిన ఇంటర్​ ఫస్టియర్​ విద్యార్థి వరుణ్.. ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో కుంగిపోయి.. ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య.. చేసుకున్నాడు.

6. కమలాపూర్​ ఆదర్శ పాఠశాల, కళాశాలలో చదువుతున్న విద్యార్థిని ఇంటర్‌ ఫస్టియర్‌లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్‌ కావడంతో పాఠశాల భవనం పైనుంచి దూకే ఆత్మహత్యా యత్నం చేసింది.. ఇది గమనించిన తోటి విద్యార్థులు.. ఆమెను- హుటాహుటిన ఏంజీఎం ఆస్పత్రికి తరలించారు. దీంతో ప్రాణాపాయం తప్పింది.

ఇంటర్ ఫలితాల తర్వాత విద్యార్ధుల ఆవేదన అర్ధం చేసుకోదగినదే. కాదనడం లేదు. అలాగని ఇంటర్ చదువు మాత్రమే జీవితం కాదు.. అది జీవితంలో ఒక భాగం మాత్రమే అన్నది సామాజివ వేత్తలుచెబుతోన్న మాట. ధీరూభాయ్ అంబానీ నుంచి మొదులు పెడితే అదానీ వరకూ ఇంటర్ ఫెయిలైన వాళ్లే. కాబట్టి ఎప్పుడూ ఒప్పుకోవద్దు ఓటమి. ఎప్పుడూ వదులుకోవద్దు ఓరిమి.

Also Read: ఉడుత చేసిన చిన్న పని… రెండు మూగజీవాలు బలి.. ఏం జరిగిందంటే