Viral Video: చార్మినార్ వద్ద విదేశీ మహిళను వేధించిన పోకిరీలు.. వీడియో వైరల్..

చార్మినార్ వద్ద హైదరాబాద్ పరువు తీసిన ఘటన జరిగింది. విదేశీ మహిళా టూరిస్ట్‌ని యువకులు మాటలతో వేధిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహిళా టూరిస్ట్‌ను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడిన ఆ పోకిరీలను కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Viral Video: చార్మినార్ వద్ద విదేశీ మహిళను వేధించిన పోకిరీలు.. వీడియో వైరల్..
Foreign Tourist Harassment At Charminar Goes Viral

Updated on: Oct 06, 2025 | 5:33 PM

ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా అమ్మాయిలపై వేధింపులు ఆగడం లేదు. కొంతమంది పోకిరీలు విదేశీయులను సైతం వేధిస్తూ దేశం పరువు తీస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఇటువంటి ఘటనే జరిగింది. చారిత్రాత్మక చార్మినార్ ప్రాంతంలో ఒక విదేశీ మహిళా టూరిస్ట్‌ని కొందరు యువకులు మాటలతో వేధించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమై వెంటనే దర్యాప్తు ప్రారంభించారు.

వీడియోలో ఏముంది..?

వైరల్ అయిన వీడియో క్లిప్‌లో యువకుల గుంపులో ఉన్న ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్న విదేశీ మహిళా పర్యాటకురాలిని ఉద్దేశించి అసభ్యకరమైన దూషణకు పాల్పడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. వెంటనే ఆ మహిళతో ఉన్న మరో వ్యక్తి ఆ గుంపు వద్దకు వచ్చి.. “సార్, మీరు చెప్పేది జాగ్రత్తగా ఉండాలి.. ఎందుకంటే ప్రజలు మీ మాట వినగలరు. జాగ్రత్తగా ఉండండి” అంటూ వారిని హెచ్చరించడం కూడా వీడియోలో రికార్డ్ అయింది.

పోలీసుల స్పందన

ఈ ఘటనకు సంబంధించి పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈ క్లిప్ మూడేళ్ల నాటిది అయినప్పటికీ, ఇటీవల వైరల్ అయినందున దీనిపై దృష్టి పెట్టామని తెలిపారు. తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటివరకు ఎటువంటి కేసు నమోదు కాలేదు. అయితే ఆ పోకిరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. నగరంలో పర్యాటకుల భద్రతకు భంగం కలిగించే ఇలాంటి చర్యలపై పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.