Monsoon Season: నార్త్‌లో అతివృష్టి-సౌత్‌లో అనావృష్టి.. తొలకరి జల్లులు లేక తల్లడిల్లుతున్న తెలంగాణ..!

| Edited By: Ravi Kiran

Jul 14, 2023 | 6:50 PM

Telangana: భారత ఉత్తరాది రాష్ట్రాలు కుండపోత వర్షాలతో మునిగిపోతుంటే దక్షిణాది రాష్ట్రాలు మాత్రం వానల కోసం ఎదురుచూస్తున్నాయి. గత కొన్ని రోజులుగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, ఢిల్లీ-ఎన్‌సిఆర్‌ వర్షం విధ్వంసం సృష్టించడమే కాక భారీ ఆస్తి నష్టం, ప్రాణనష్టానికి..

Monsoon Season: నార్త్‌లో అతివృష్టి-సౌత్‌లో అనావృష్టి.. తొలకరి జల్లులు లేక తల్లడిల్లుతున్న తెలంగాణ..!
Farmers Waiting Fro Rains in Telangana
Follow us on

Telangana: భారత ఉత్తరాది రాష్ట్రాలు కుండపోత వర్షాలతో మునిగిపోతుంటే దక్షిణాది రాష్ట్రాలు మాత్రం వానల కోసం ఎదురుచూస్తున్నాయి. గత కొన్ని రోజులుగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, ఢిల్లీ-ఎన్‌సిఆర్‌ వర్షం విధ్వంసం సృష్టించడమే కాక భారీ ఆస్తి నష్టం, ప్రాణనష్టానికి దారితీసింది. మరోవైపు తమిళనాడు మినహా కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి దక్షిణాది రాష్ట్రాల్లో.. జార్ఖండ్, బీహార్, అస్సాం, త్రిపుర, మిజోరాం, మేఘాలయ వంటి ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటికీ వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని జాతీయ మీడియా పేర్కొంది.

అయితే తొలకరి జల్లులు కురవాల్సిన సమయం ఆసన్నమైనప్పటికీ తెలుగు రాష్ట్రాలపై వరుణుడు కరుణించడంలేదు. ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు రోజులుగా అడపాదడపా ఒక మోస్తరు వర్షాలు పడుతున్నా.. తెలంగాణ జిల్లాలను వర్షాలు మరిచిపోయాయేమో అన్నట్లుగా ఇటువైపు వాన జల్లుల ఆచూకీ కూడా లేదు. మొత్తం 33 జిల్లాలకు 22 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదవుతుండగా.. కృష్ణా, గోదావరి బేసిన్‌లకు ఒక్క చుక్క నీరు కూడా చేరలేదు. ప్రాణహిత మినహా , ఈ 2 ప్రధాన నదుల పరీవాహకాల్లో ప్రవహించే 53 పెద్ద, చిన్న ఉపనదులు అన్నీ దాదాపు ఎండిపోయాయి.

మరోవైపు లోటు వర్షపాతం ఈ ఏడాది ఖరీఫ్(వనకాలం)పై నీడను కమ్మేసేలా చేసింది. జూన్ 1 నుంచి జూలై 12 వరకు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 22 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఫలితంగా ఎక్కువగా దెబ్బతిన్న జిల్లాల్లో ఖమ్మం (-50.7 %), జగిత్యాల్ (-42.7 %), వరంగల్ (-39.2), నిజామాబాద్(-38.4 %) ఉన్నాయి. గతేడాది తెలంగాణలో 395.6మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా.. ఈ ఏడాది జూన్ 1 నుంచి జూలై 11 వరకు 150.4 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదయింది.

ఇవి కూడా చదవండి

మరోవైపు జూరాల, శ్రీశైలం, నిజాం సాగర్‌లలోకి సున్నా.. నాగార్జున సాగర్‌లోకి 4,185 క్యూసెక్కులు, ఎస్‌ఆర్‌ఎస్‌పికి 4981 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోలు మాత్రమే రావడంతో వానకాలం పంటల భవితవ్యంపై అనిశ్చితి ఏర్పడింది. కృష్ణా బేసిన్‌లోని ఆల్మట్టి డ్యామ్‌కు ఇప్పుడిప్పుడే ఇన్‌ఫ్లోలు చేరడంపై ఆశాజనకంగా కనిపిస్తోంది. కనీసం ఆగస్టు మొదటి వారంలోగా అయినా మంచి వర్షాలు కురిస్తే, రైతులు ఆలస్యంగానైనా నాటుసాగు చేసేందుకు ఆశలు పెట్టుకోవచ్చు. శ్రీశైలంలో ఇప్పటికి లైవ్ స్టోరేజీ 33.72 టీఎంసీలు(గతేడాది 44 టీఎంసీలు), నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో 147 టీఎంసీలు(గతేడాది 165 టీఎంసీలు) ఉన్నాయి.

కాగా, రోజులు గడుస్తున్నా ఆశించిన రీతిలో వర్షాలు లేకపోవడంతో.. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,24,28,723 ఎకరాలకుగానూ 42,76,263 ఎకరాల్లోనే సాగు చేసేందుకు విత్తనాలు నాటినట్లు అధికారులు తెలిపారు. వీటిలో 31,88,200 ఎకరాల్లో పత్తి,  దాదాపు 3 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగుకు సిద్ధం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం