
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ప్రపంచాన్ని ఎంత వేగంగా మారుస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇదే ఏఐ ఇప్పుడు విద్యా వ్యవస్థకు ముఖ్యంగా పరీక్షల నిర్వహణకు పెద్ద సవాల్‌గా మారింది. ఏఐ సాయంతో విద్యార్థులు భారీగా కాపీయింగ్‌కు పాల్పడుతుండటంతో ప్రపంచంలోనే అతిపెద్ద అకౌంటింగ్ సంస్థ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంటెంట్స్(ACCA) తన ఆన్‌లైన్ రిమోట్ ఇన్విజిలేటెడ్ అంటే ఇంటి నుంచి రాసే పరీక్షలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఏఐ చాట్‌బాట్‌ల ద్వారా పరీక్షల్లో మోసాలు పెరిగిపోవడం, అవి నియంత్రించలేని స్థాయికి చేరుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.
కరోనా సమయంలో విద్యార్థుల సౌకర్యార్థం ఇంటి నుంచే పరీక్షలు రాసే వెసులుబాటును ACCA కల్పించింది. అయితే ఇటీవల కాలంలో విద్యార్థులు పరీక్షల సమయంలో ప్రశ్నలకు సమాధానాలు వెతకడానికి ChatGPT వంటి ఏఐ సాధనాలను వాడుతున్నట్లు గుర్తించారు. రిమోట్ పరీక్షల్లో ఏఐ ద్వారా కాపీ కొట్టడం వల్ల పరీక్షల నాణ్యత దెబ్బతింటోందని సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. మోసాలు ఎంతలా పెరిగాయంటే ఇక టెక్నాలజీతో వాటిని అడ్డుకోవడం అసాధ్యమని సంస్థ భావిస్తోంది. పరీక్షల పారదర్శకతను కాపాడేందుకు మళ్లీ ఇన్-పర్సన్ పద్ధతికే సంస్థ మొగ్గు చూపుతోంది.
ACCA తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విద్యార్థులపై ప్రభావం పడనుంది. ఇకపై విద్యార్థులు నిర్ణీత పరీక్షా కేంద్రాలకు వెళ్లి ఇన్విజిలేటర్ల సమక్షంలోనే పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ప్రొఫెషనల్ కోర్సుల విలువను కాపాడటమే తమ ప్రాధాన్యత అని సంస్థ స్పష్టం చేసింది. ఈ పరిణామం కేవలం అకౌంటింగ్ రంగానికే పరిమితం కాకపోవచ్చు. భవిష్యత్తులో ఇతర గ్లోబల్ ఎగ్జామినేషన్ బాడీలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉంది. ఏఐ చాట్‌బాట్‌లు మనుషుల కంటే వేగంగా సమాధానాలు ఇస్తుండటంతో.. విద్యార్థుల నిజమైన ప్రతిభను అంచనా వేయడం విద్యా సంస్థలకు కత్తిమీద సాములా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..