తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి వచ్చిన భూ ప్రకంపనలతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో రాత్రి 9.25 నిమిషాల సమయంలో భూమి కొన్ని సెకన్ల పాటు కంపించింది. దీని తీవ్రతకు ఇళ్లలో ఉన్న వస్తువులు కిందపడటం, శబ్దాలు రావడంతో భయకంపితులైన జనం రోడ్లపైకి పరుగులు తీశారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ హఠాత్పరిణామంతో జనం భయంతో గడుతుపుతున్నారు. అసలు తెలంగాణలో ఏప్రాంతంలో భూకంపాలు వచ్చే అవకాశముంది. గతంలో ఎక్కడెక్కడ వచ్చాయి. ఒకసారి తెలుసుకుందాం.
దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలుగురాష్ట్రాల్లో భూప్రకంపనలు అప్పుడప్పుడూ భయపెడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణలో భద్రాచలం, ఏపీలో నెల్లూరు ప్రాంతాల్లో ఈ భూ ప్రకంపనలు అప్పుడప్పుడూ వస్తూనే ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో భూకంపాలకు గల ముఖ్య కారణం గోదావరి పరీవాహక ప్రాంతం కావడమేనని నిపుణులు తెలియజేస్తున్నారు.
గత యాభై ఏళ్లలో తెలుగురాష్ట్రాల్లో ఎక్కడ భూకంపాలు సంభవిస్తాయో అధికారులు ఖచ్చితంగా గుర్తించగలుగుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలోని భద్రాచలం ప్రాంతంలో అధికంగా భూ ప్రకంపనలు వచ్చే అవకాశాలున్నట్టుగా తేల్చారు. గోదావరి పరీవాహక ప్రాంతం కావడం, అక్కడ బొగ్గు నిక్షేపాలు ఏర్పడటమే దీనికి కారణంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు, గుండ్లకమ్మ వాగు వద్ద, అద్దంకి, నూజివీడు వంటి ప్రాంతాల్లో కూడా భూకంపాలు వచ్చే వీలున్నట్టుగా గుర్తించారు. నిజానికి ఒక పెద్ద భూకంపం వచ్చిన తర్వాత మళ్లీ చిన్నవి తరచూ రావడం సహజమేనంటున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో గరిష్ట తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.3గా నమోదైంది. అదికూడా గోదావరి పరీవాహక ప్రాంతంలోనే.
ఇక శుక్రవారం రాత్రి భూకంపం వచ్చిన ఆదిలాబాద్,నిర్మల్ ప్రాంతాలు కూడా గోదావరి పరీవాహక ప్రాంతాలే అని గమనించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే హైదరాబాద్ నగరానికి భూకంపాల వల్ల ఎలాంటి నష్టం లేదంటున్నారు నిపుణులు. 1983 జూన్ 30న మేడ్చల్ లో పెద్ద భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దాని తీవ్రత 4.5గా నమోదైంది. అప్పటినుంచి ఇప్పటివరకు ఎలాంటి భూ ప్రకంపనలు నగరంలో నమోదు కాలేదు.
అయితే పెరిగిపోతున్న అపార్ట్ మెంట్ కల్చర్ అత్యంత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా నగరాల్లో భారీగా నిర్మితమవుతున్న అపార్ట్ మెంట్లతో ఎప్పటికైనా ప్రమాదమేనని, గ్రౌండ్ ఫ్లోర్ నిర్మించకుండా పార్కింగ్ కోసం ఖాళీగా ఉంచడం వల్ల భూకంపాల సమస్యను అధిగమించడం సాధ్యం కాదని హెచ్చరిస్తున్నారు.