Terror Links: బోధన్‌లో కలకలం సృష్టించిన టెర్రర్ లింక్ అరెస్ట్ వ్యవహారంపై.. బాధిత యువకుడు తన్వీర్ తండ్రి స్పందించాడు. తమ అబ్బాయి సౌదీ అరేబియాకు ఎప్పుడూ వెళ్లలేదని స్పష్టం చేశాడు. వేరే దేశంలో ఉండేవాడని, ఆ దేశం పేరు తాము చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తమ అబ్బాయిని నెలన్నర క్రితమే హైదరాబాద్ పోలీసులు పాస్‌పోర్ట్ విచారణ పేరుతో అదుపులోకి తీసుకున్నారని, విచారణ అనంతరం మళ్లీ వదిలేశారని చెప్పుకొచ్చాడు. తన్వీర్ ప్రస్తుతం ఇండియాలోనే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడని అతని తండ్రి తెలిపారు. తాము ఇండియాలో పుట్టాం.. ఇండియాలో పెరిగాం.. పాకిస్తాన్ కోసం ఎందుకు పని చేస్తామంటూ ఆవేదనతో ప్రశ్నించాడు.
ఇదిలాఉంటే.. నిజామాబాద్ జిల్లా మరోసారి ఉలిక్కి పడింది. రోహింగ్యాలకు ఒకే అడ్రస్‌పై 72 పాస్ పోర్టుల అంశంపై విచారణ పూర్తవక ముందే.. బోధన్ పట్టణంలో తీవ్ర కలకం రేగింది. సౌదీలో ఐసిస్‌తో సంబంధాలు ఉన్నాయనే కారణంతో బోధన్‌కు చెందిన తన్వీర్‌ను తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బోధన్‌కు చెందిన తన్వీర్ మూడేళ్ల క్రితం సౌదీకి వెళ్లాడు. అక్కడే ఓ పాకిస్తానీ పరిచయం ఏర్పరుచుకున్నాడు. అయితే, ఆ పరిచయం ఉగ్రపరిచయం అని సౌదీ పోలీసులు తేల్చి అదుపులోకి తీసుకున్నారు.
పాకిస్తాన్‌తో గూఢచర్యం, ఐసిస్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో తన్వీర్‌ను సౌదీ అరేబియా పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు ఎనిమిదిన్నర నెలలు జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై బయటకొచ్చాడు తన్వీర్. అలా బయటకు వచ్చిన తన్వీర్ సౌదీ నుంచి పరారై బోధన్‌కు తిరిగి వచ్చాడు. అయితే, సౌదీలో తన్వీర్ మిస్ అవ్వడంతో అక్కడి ఇంటెలిజెన్స్ పోలీసులు ఆరా తీశారు. ఇండియా వెళ్లాడని నిర్ధారించుకున్న అక్కడి అధికారులు.. ఐబీకి సమాచారం అందించారు. వెంటనే తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్‌ను అలర్ట్ చేసింది ఐబి. తన్వీర్ కోసం తీవ్రంగా గాలించిన ఐబి అధికారులు.. చివరికి బోధన్ లోని రేంజల్ బేస్ క్యాంప్‌లో అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఈ ఆపరేషన్ నిర్వహించారు.
Also read:
Atrocities: సిద్దిపేట జిల్లాలో దారుణం.. తొమ్మిదేళ్ల కూతురును రోకలిబండతో కొట్టి చంపిన తల్లి