Telangana: టీచర్ స్కూల్‌కి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో నగలు చోరీ.. సీసీ విజువల్స్ చెక్ చేయగా.. షాకింగ్

| Edited By: Ram Naramaneni

Jul 22, 2024 | 11:20 AM

నిర్మల్ పట్టణంలోని మహదేవపూర్ కాలనీలో అనితారాణి- శివ దంపతులు నివాసముంటున్నారు. భార్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కాగా, భర్త ఖాళీగానే ఉంటున్నాడు. రోజూ భార్యను పాఠశాలలో దింపేసి తీసుకురావడం తన పని. అందులో భాగంగానే శుక్రవారం రోజు ఎప్పటిలాగే ఆమెను పాఠశాల వద్ద దింపేశాడు... ఆ తర్వాత...

Telangana: టీచర్ స్కూల్‌కి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో నగలు చోరీ.. సీసీ విజువల్స్ చెక్ చేయగా.. షాకింగ్
Theft
Follow us on

జల్సాలకు అలవాటు పడ్డ ఓ ఇంటి వ్యక్తి తన సొంతింటికే కన్నం వేశాడు. భార్య నగలను అపహరించి దొంగ తనంగా చిత్రీకరించాడు. ఇంట్లో దొంగ తనం జరిగిందని గుర్తించిన‌ భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు గుట్టు రట్టైంది. రంగంలోకి దిగిన పోలీసులు తమ స్టైల్లో విచారణ జరుపగా సీసీ కెమెరాల్లో అసలు బండారం బట్టబయలైంది. భార్య నగలను అపహరించింది భర్తే అని తేలింది. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటు‌చేసుకుంది.

నిర్మల్ టౌన్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ పట్టణంలోని మహదేవపూర్ కాలనీలో అనితారాణి- శివ దంపతులు నివాసముంటున్నారు. భార్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కాగా, భర్త ఖాళీగానే ఉంటున్నాడు. రోజూ భార్యను పాఠశాలలో దింపేసి తీసుకురావడం తన పని. అందులో భాగంగానే శుక్రవారం రోజు ఎప్పటిలాగే ఆమెను పాఠశాల వద్ద దింపేశాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన అనితరాణి.. ఇంటి తలుపులు బార్ల తెరిచి ఉండటం, బీరువాలో వస్తువులు చిందరవందరగా పడి ఉండటం గమనించి షాక్ కు గురయ్యారు. బీర్వలో దాచిన బంగారు, వెండి ఆభరణాలు కనిపించకపోవడంతో దొంగ తనం జరిగిందని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సమీపంలో‌ని సీసీ పుటేజ్ ను పరిశీలించారు. అంతే అసలు గుట్టు రట్టైంది. ఇంటి వెనుక నుండి బైక్ వచ్చిన‌ ఓ వ్యక్తి ఇంట్లోని నగదును అపహరించి దర్జాగా జంప్ అయినట్టు గుర్తించారు. సీన్ కట్ చేస్తే ఆ వ్యక్తి ఆ ఇంటి యజమాని శివనే అని తేలడంతో పోలీసులు సైతం అవక్కయ్యారు. విషయం తెలిసిన భార్య అనితరాణి షాక్ కు గురవగా.. స్థానికులు‌ ముక్కున వేలేసుకున్నారు. నిందితుడు శివ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా.. తన అవసరాల కోసం సొంతింట్లోనే చోరీకి పాల్పడ్డానని ఒప్పుకున్నాడు. జల్సాలకు‌ అలవాటు పడి అప్పుల‌పాలవడం.. భార్యకు తెలియకుండా అప్పు తీర్చే మార్గం లేకపోవడంతో సొంతింటికే కన్నం వేసి భార్య అనితరాణి కి‌ చెందిన 8.1 తులాల బంగారు, 6 తులాల వెండి ఆభరణాలను అపహరించినట్టు తెలిపాడు భర్త శివ. నిందితుడు శివను అరెస్టు చేసిన పోలీసులు 3.20 విలువ చేసే బంగారం ఆరు తులాల వెండిని స్వాధీనం చేసుకుని.. నిందితుడిని రిమాండ్ కు తరలించారు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేకపోయినా.. ఈ నయా జమానాలో సీసీ కెమెరాలు మాత్రం పట్టేస్తాయన్న విషయాన్ని మరిచిపోయిన సదరు భర్త.. సొంతిటికే కన్నం వేసి కటకటాల పాలయ్యాడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..