Chicken: కొక్కరతో వేలాది కోళ్ల మృత్యువాత.. వ్యాధి ఎలా వస్తుంది..? లక్షణాలు ఎలా ఉంటాయంటే..

ఉన్నట్టుండి వేలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.. దీంతో ఏమైందో తెలియక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పౌల్ట్రీ రైతులను కొక్కర వ్యాధి వణికిస్తోంది. నిన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న కోళ్లు, అకస్మాత్తుగా వింత వ్యాధి బారిన పడి వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. కోళ్ల ఫారాల్లో కోళ్లు కుప్పలు తెప్పలుగా చనిపోతుండటంతో పౌల్ట్రీ రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు..

Chicken: కొక్కరతో వేలాది కోళ్ల మృత్యువాత.. వ్యాధి ఎలా వస్తుంది..? లక్షణాలు ఎలా ఉంటాయంటే..
Chicken

Edited By:

Updated on: Mar 17, 2026 | 5:35 PM

ఉన్నట్టుండి వేలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.. దీంతో ఏమైందో తెలియక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పౌల్ట్రీ రైతులను కొక్కర వ్యాధి వణికిస్తోంది. నిన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న కోళ్లు, అకస్మాత్తుగా వింత వ్యాధి బారిన పడి వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. కోళ్ల ఫారాల్లో కోళ్లు కుప్పలు తెప్పలుగా చనిపోతుండటంతో పౌల్ట్రీ రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో పౌల్ట్రీరంగం కుదేలవుతోంది. గత కొద్దిరోజులుగా మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల కోళ్లకు కొక్కర వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అందె గ్రామంలోనే ఒకే కోళ్ల ఫామ్ లో దాదాపు 8 వేల కోళ్లు చనిపోయాయి. మెదక్ జిల్లాలోని తూప్రాన్, కౌడిపల్లి, మనోహరాబాద్, తూప్రాన్, వెల్దుర్తి, పాపన్నపేట మండలాల్లో సుమారు 80 వేలకు పైగా కోళ్లు కొక్కొర వ్యాధి సోకి మృత్యువాతపడ్డాయి. ఒక కోడి నుంచి మరో కోడికి ఈ వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తుండటంతో పౌల్ట్రీ ఫారాలు ఖాళీ అవుతున్నాయి. ఈ మండలాల్లోని కొన్ని కోళ్ల ఫామ్ లలో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.

కొక్కెర వ్యాధి ఎలా వస్తుంది..?

కొక్కెర వ్యాధి పారమిక్సో తరగతి వైరస్‌ వలన సంక్రమిస్తుంది. అన్ని వయస్సుల కోళ్లకు, అన్ని రకాల కోళ్లలో.. అంటే లేయర్స్‌, బ్రాయిలర్స్‌, దేశీ కోళ్లలో కూడా వస్తుంది.. ఈ వ్యాధి వలన అధికంగా మరణాలు సంభవించడమే కాకుండా గుడ్ల ఉత్పత్తి, మాంసం పై ప్రభావం చూపుతుంది. కోళ్లకు సోకె కొక్కెర తెగులును రాణిఖేత్ వ్యాధి అనికూడా పిలుస్తారు. కోళ్లకు లసోటా వ్యాక్సిన్, విటమిన్లు ఇవ్వడం ద్వారా కొక్కెర వ్యాధి నివారణ సాధ్యమని పశువైద్యులు సూచిస్తున్నారు. ఈ వ్యాధి వైరల్ వ్యాధి కావడంతో ప్రత్యేక చికిత్స లేకపోయినా.. కొన్ని నివారణ పద్దతులతో నివారించవచ్చని పేర్కొంటున్నారు.

లక్షణాలు ఎలా ఉంటాయంటే..

కొక్కెర వ్యాధిని శాస్త్రీయంగా రాణికేట్ డిసీజ్ (ఆర్డీ) అని పిలుస్తారు. ఇది ఏ వయసు కోళ్లకైనా సోకుతుంది. ఈ వ్యాధి కారకాలు ఎక్కువగా గాలి ద్వారా వ్యాపిస్తాయి. వ్యాధి సోకిన కోళ్లు పిచ్చుకలు కూడా ఈ వైరస్ ను రవాణా చేసే వాహకాలుగా పని చేస్తాయి. ముఖ్యంగా గాలి ద్వారా సోకే ఈ వైరస్ ఒక కోడికి వస్తే, గంటల వ్యవధిలోనే ఫామ్ లోని మిగతా అన్ని కోళ్లకు విస్తరిస్తూ ప్రాణాలు తీస్తోంది. కోళ్లకు వ్యాక్సిన్లు వేసినా కొక్కర వ్యాధి తగ్గడం లేదని.. రాత్రి వరకు బాగున్న కోళ్లు, తెల్లవారేసరికి చనిపోతున్నాయి అంటున్నారు పౌల్ట్రీ రైతులు.. సాధారణంగా ఎండాకాలం ప్రారంభంలో వచ్చే ఈ వ్యాధి.. ఈసారి ముందే పంజా విసరడం పౌల్ట్రీ యజమానులను ఆందోళనకు గురిచేస్తోంది. కొక్కెర వ్యాధి కోళ్ల శ్వాస,జీర్ణ,నాడీ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వ్యాధికి గురైన కోళ్లు ఆకుపచ్చ రంగులో నీళ్ల విరేచనాలు చేసుకుంటాయి.

కంటి, ముక్కు నుంచి నీరు కారుతుంది. ఎప్పుడూ రెక్కలు వేలాడదీసుకొని ఉంటాయి. శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బంది పడతాయి. దాణా, నీళ్లు తీసుకోవు. ఫలితంగా నరాలు బలహీనంగా మారి వణుకుతూ ఉంటాయి. రెక్కలు రాలి పోతాయి. కాళ్లు, మెడ వంకర్లు పోతాయి. పేగుల్లో పొరలు, ఎర్రబడి, అల్సర్ లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి తీవ్రత పెరిగి, పక్షవాతం లక్షణాలతో మరణిస్తాయి.

ఈ వ్యాధి సోకిన కోళ్లు బతికి బయటపడటం చాలా కష్టం.. 80 నుంచి 90 శాతం వరకూ మరణిస్తాయి.. రెట్టలు వేయడం వంటి లక్షణాలతో నిమిషాల వ్యవధిలోనే కుప్పకూలుతున్నాయి. చనిపోయిన కోళ్లను జేసీబీలతో గొయ్యి తీసి పూడ్చిపెడుతున్న దృశ్యాలు జిల్లాలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. పశుసంవర్ధక శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, మందులు పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని..లేదంటే చావే శరణ్యంమంటున్నారు రైతులు..

ఆకాశన్నంటుతున్న చికెన్ ధరలు..

ఇక కోళ్లఫామ్ ల వద్ద పరిస్థితి ఇలా ఉంటే చికెన్ సెంటర్ల వద్ద మరోలా ఉంది.. వైరస్ వ్యాప్తితో సంబంధం లేకుండా చికెన్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి.. కిలో చికెన్ 350 రూపాయల వరకు పలుకుతుంది. ఈ సమయంలో కోళ్లకు వ్యాధి రాకుండా ఉంటే పెట్టిన పెట్టుబడికి గిట్టుబాటు అయ్యేదని రైతులు అభిప్రాయ పడుతున్నారు. మొత్తంగా కొక్కెర వ్యాధి కోళ్ల ఫారాల రైతులను వణికిస్తోంది. పశువైద్యాధికారులు ఈ వ్యాధిపై దృష్టి సారించి పౌల్ట్రీ రైతులకు సూచనలిస్తే కోళ్ల మరణాలు తగ్గి రైతులు నష్టాల బారిన నుంచి బయటపడే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us