కామారెడ్డి జిల్లా గాంధారి మండలం బిర్మల్ తండాలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలిక మగబిడ్డకు జన్మనిచ్చి ఆపై ఆత్మహత్య చేసుకుంది. శిశువు అరుపులు విన్న స్తానికులు అటుగా వెళ్లి చూశారు. ముళ్ల పొదల్లో ఉన్న బిడ్డను చూసి షాకయ్యారు. పోలీసులకు సమాచారం ఇచ్చి శిశువును జిల్లా ఆస్పత్రికి తరలించారు. శిశువు తల్లి అవివాహిత అని తెలుస్తోంది. పసికందును ముళ్లపొదల్లో పడేసి.. ఆ తర్వాత బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. తల్లి మృతదేహాన్ని బావిలోంచి బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం బాన్వాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.
మంగళవారం రాత్రి మూడు గంటల సమయంలో నవజాత శిశువును ఐసీడీఎస్ అధికారులు కామారెడ్డి గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. పసికందుకు చికిత్స అందిస్తూ.. అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేస్తున్నారు. తల్లి మృతి చెందిందా? లేక ఎవరైనా హత్య చేసి బావిలో పడేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు గాంధారి పోలీసులు వెల్లడించారు.
ఘటనపై స్పందించిన మంత్రి
ఈ ఘటనపై గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలిక మృతికి కారణమైన వారికి కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పసికందు ఆరోగ్యాన్ని పరిరక్షించాలని, మెరుగైన చికిత్స అందించాలని మంత్రి సూచించారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరపాలని ఆదేశించారు. బాలిక కుటుంబానికి గవర్నమెంట్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని… విచారణ చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. అనంతరం శిశువును ఆస్పత్రిలో చేర్పించారని చెప్పారు. బాలికను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి… మోసం చేసి గర్భవతిని చేసినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే దోషులను పట్టుకుని తగిన శిక్ష పడేలా చూస్తామని మంత్రి స్పష్టం చేశారు.
Also Read: 5 కంటే ఎక్కువ కేసులు నమోదైతే స్కూల్ క్లోజ్.. వ్యాక్సిన్ వేయించుకోకపోతే అక్కడ నో ఎంట్రీ