Hyderabad: తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం.. లేచిన పిల్లలు లైట్ వేసి చూడగా..

బోరబండలో జరిగిన సరస్వతి హత్య కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. నిన్నటి నుంచి పరారీలో ఉన్న భర్త ఆంజనేయులును పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబ కలహాలు, అనుమానాలే ఈ దారుణానికి కారణమని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు.

Hyderabad: తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం.. లేచిన పిల్లలు లైట్ వేసి చూడగా..
Representative Image

Edited By:

Updated on: Jan 21, 2026 | 9:11 AM

అనుమానంతో నిద్రిస్తున్న భార్య సరస్వతిపై భర్త ఆంజనేయులు రోకలిబండతో దాడి చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. భార్యను హత్య చేసిన అనంతరం “నా భార్యను నేను చంపాను” అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టడం కలకలం రేపింది. అంతేకాదు, పిల్లలకు “మీ అమ్మ పడుకుంది, మీరు కూడా పడుకోండి” అని చెప్పి ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయినట్లు సమాచారం. కొద్దిసేపటి తర్వాత లైట్ వేసి చూసిన పిల్లలకు తల్లి సరస్వతి రక్తపు మడుగులో పడి ఉండటం కనిపించింది. వెంటనే వారు తమ మామయ్యకు ఫోన్ చేసి విషయం తెలియజేశారు. సమాచారం అందుకున్న కుటుంబీకులు.. పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సరస్వతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు భర్త ఆంజనేయులుపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండటంతో అతడిని పట్టుకునేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

ఇది చదవండి: ‘ఆ సాంగ్ వల్లే హీరోయిన్‌గా సినిమాలు మానేశా.!’

ఈ ఘటనపై స్థానికుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కుటుంబ కలహాల నేపథ్యంలో పిల్లల ముందే ఇలాంటి దారుణానికి పాల్పడటం అమానుషమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని.. వారికి కౌన్సెలింగ్ అందించాలని పలువురు కోరుతున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. రోకలిబండను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించారు. సరస్వతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఆంజనేయులు మొబైల్ ఫోన్, కాల్ డేటా, వాట్సాప్ కార్యకలాపాల ఆధారంగా నిందితుడి కదలికలను పోలీసులు ట్రాక్ చేస్తున్నారు.

ఇది చదవండి: ఏడాది పొడవునా డబ్బే డబ్బు.! ఎవర్‌గ్రీన్ బిజినెస్‌లు.. ఇప్పుడు వీటికే డిమాండ్

సీసీటీవీ ఫుటేజ్, బంధువులు-స్నేహితుల నుంచి సేకరిస్తున్న సమాచారంతో అతడి ఆచూకీపై దృష్టి సారించారు. త్వరలోనే నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.ఈ దారుణ హత్య కేసులో నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సరస్వతి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

ఇది చదవండి: పరిటాల రవిని చంపిన మొద్దు శీను అవ్వాలనుకున్నది ఇదే.. కానీ చివరికి.!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..