Telangana: పక్కా ప్లాన్‌తో అనసూయమ్మను హోటల్‌కు పిలిచారు.. పట్టపగలే దృశ్యం సినిమాను మించిన సీన్..

నాగరిక సమాజంలో జనం జల్సాలకు అలవాటు పడి అప్పుల పాలవుతున్నారు. దీంతో ఈజీ మనీ అడ్డదారులు తొక్కుతున్నారు. డబ్బులు, బంగారం కోసం ఎంతవరకైనా తెగబడుతున్నారు. హత్యలకు కూడా వెనకాడడం లేదు. డబ్బుల కోసం ఓ మహిళను హత్య చేసి ఏం చేశారో.. తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Telangana: పక్కా ప్లాన్‌తో అనసూయమ్మను హోటల్‌కు పిలిచారు.. పట్టపగలే దృశ్యం సినిమాను మించిన సీన్..
Crime News

Edited By:

Updated on: Jan 26, 2026 | 3:28 PM

నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) కు చెందిన రాములు ధనలక్ష్మిలు వంట మనుషులుగా పనిచేస్తున్నారు. అయితే రెండేళ్ల క్రితం ఉపాధి కోసం సమీపంలోని హాలియా పట్టణానికి వచ్చారు. ఈ దంపతులతో పాటు కుమారుడు సాయి కుమార్ కలిసి స్థానికంగా ధనలక్ష్మి ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. అయితే, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహణతో ఆశించిన ఆదాయం రావడం లేదు. మరోవైపు తండ్రి కొడుకులిద్దరూ కూడా మద్యానికి బానిసయ్యారు. దీంతో పరిచయస్తుల వద్ద అప్పులు కూడా చేశారు. హాలియాలోని రెడ్డికాలనీలో 30 ఏళ్లుగా నివాసముంటున్న సుంకిరెడ్డి అనసూయమ్మ (67) వ్యవసాయ కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. కూలి చేసుకుంటూ వచ్చిన డబ్బులను పోగు చేసుకునేది. ప్రభుత్వం ద్వారా ప్రతి నెల వచ్చే రేషన్ బియ్యాన్ని పట్టణంలోని దేవరకొండరోడ్డులో ధనలక్ష్మి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకులు రాములు, ధనలక్ష్మిలకు అమ్మేది. ఈ క్రమంలో అప్పు ఇచ్చిన వాళ్లు డబ్బులు ఇవ్వాలంటూ రాములు, ధనలక్ష్మిలపై ఒత్తిడి చేశారు. దీంతో ఏంచేయాలో తెలియక.. ఈజీ మనీకోసం భార్యాభర్తలు, కొడుకు కలిసి ఓ పథకం వేశారు.

ఒంటరి మహిళ గా ఉన్న అనసూయమ్మపై బంగారు ఆభరణాలపై కన్నేశారు. రేషన్ బియ్యానికి సంబంధించి అనసూయమ్మకు గతంలో 2000 రూపాయలు ఇచ్చారు.. పథకం ప్రకారం మూడు రోజుల క్రితం రేషన్ బియ్యానికి సంబంధించి మిగిలిన 300 రూపాయలను ఇస్తామంటూ రాములు.. అనసూయమ్మకు ఫోన్ చేశాడు. దీంతో అనసూయమ్మ డబ్బుల కోసం రాములు ఇంటికి వెళ్ళింది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లోకి అనసూయమ్మ రాగానే ముగ్గురు కలిసి వెనకనుంచి తలపై బలంగా కొట్టారు. దీంతో స్పృహ కోల్పోయిన అనసూయమ్మ గొంతు కోశారు. ఆమె ఒంటిపై ఉన్న నాలుగు తులాల, గొలుసు, చెవి దిద్దులను తీసుకున్నారు. ఆ తర్వాత ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లోనే గోతి తీసి వృద్ధురాలి మృతదేహాన్ని పూడ్చివేశారు. ఆ గుంతను గుర్తుపట్టకుండా ఉండేందుకు ఖాళీ బీరు, వాటర్ బాటిల్స్ ను వేసి ఉంచారు. అనసూయమ్మ ఒంటిపై నుండి తీసుకున్న బంగారు ఆభరణాలను స్థానికంగా ఉన్న ప్రైవేటు ఫైనాన్స్ లో తాకట్టు పెట్టారు. వచ్చిన డబ్బులతో కొన్ని అప్పులను కూడా తీర్చేశారు. గుట్టు చప్పుడు కాకుండా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను నిర్వహిస్తున్నారు.

మూడు రోజుల క్రితం ఇంటి నుండి బయటకు వెళ్లిన అనూసూయమ్మ కనిపించక పోవడంతో చుట్టుపక్కల వాళ్లతో పాటు బంధువులు కూడా ఆందోళన చెందారు.. హాలియా తోపాటు బంధువుల ఇళ్లలో కూడా వెతికారు. అయినా అనసూయమ్మ ఆచూకీ తెలియక పోవడంతో బంధువులు హాలియా పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అనసూయమ్మ ఇంటి నుండి బయటకు వెళ్లిన సీసీ ఫుటేజీని పరిశీలించారు. అనసూయమ్మ నేరుగా ఇంటి నుండి ధనలక్ష్మి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లోకి వెళ్లినట్లు కనిపించింది. తిరిగి ఆ ఇంటి నుండి ఆమె బయటకు వచ్చిన ఫుటేజ్ మాత్రం కనిపించలేదు. దీంతో అనుమానించిన పోలీసులు రాములు, ధనలక్ష్మి కొడుకు సాయికుమార్ లను అదుపులో తీసుకొని విచారించారు. ఇంకేముంది డబ్బుల కోసం అనసూయమ్మను హత్య చేసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లోనే పూడ్చి వేశామని నిందితులు నేరాన్ని అంగీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఒంటరి వృద్ధ మహిళను నమ్మించి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు, బంధువులు ఆందోళన చేశారు. ఇలాంటి కంత్రిగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్థానికులను పోలీసులు సూచిస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..