ఆలయం చేరిన మెస్రం ఆరాధ్య దైవం నాగోబా.. మహాపూజతో అట్టహాసంగా మొదలైన నాగోబా జాతర
మెస్రం వంశస్తులు అనాదిగా వస్తున్న తమ ఆచారం మేరకు మహాపూజలు నిర్వహించి జాతర ఉత్సవాలను ప్రారంభించారు.
Nagoba Maha Jathara : మెస్రం గిరిజనుల ఆరాధ్య దైవమైన నాగోబా జాతర గురువారం ఘనంగా మొదలైంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో మెస్రం గిరిజనులు ఉదయం మర్రిచెట్టు విడిది సమీపంలోని కోనేరు నుంచి సంప్రదాయ వాయిద్యాలతో నాగోబా విగ్రహంతో ఊరేగింపు నిర్వహించారు. నాగోబాను ఆలయానికి తీసుకువచ్చి ప్రతిష్టించారు. దీంతో జాతర మొదలైనట్టుగా మెస్రం గిరిజన పెద్దలు ప్రకటించడంతో సందడి నెలకొంది.
ఆదివాసీల అత్యంత పవిత్రమైన జాతర కెస్లాపూర్ నాగోబా జాతర మెస్రం వంశస్తుల మహాపూజలతో అర్థరాత్రి వేళ ఘనంగా ప్రారంభించారు. పుష్యామవాస్య వేళ హస్తినమడుగు నుండి తెచ్చిన పవిత్ర గంగా జలంతో నాగదేవుడిని అభిషేకించిన మెస్రం వంశస్తుల మహాపూజారి కటోడా హన్మంతరావు, మెస్రం వంశుస్తులు పటేల్ వెంకట్రావ్ నేతృత్వంలో మహా పూజ రాత్రి 11:40 గంటలకు అట్టహాసంగా ప్రారంభమైంది.
మెస్రం వంశస్తులు అనాదిగా వస్తున్న తమ ఆచారం మేరకు మహాపూజలు నిర్వహించి జాతర ఉత్సవాలను ప్రారంభించారు. జాతరకు హాజరైన ఆసిపాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తదితరులు మెస్రం వంశీయులు ఘనమైన స్వాగతం పలికారు. గంగ జల అభిషేకం , మహా పూజ అనంతరం నాగోబాను దర్శించుకున్నారు అదికారులు.
కరోనా కారణంగా గిరిజన దర్బార్‌ను రద్దు చేసిన అధికారులు.. ఆదివాసీలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు కలెక్టర్. ప్రధాన ఘట్టం మహాపూజ అనంతర జాతర ప్రారంభమవడంతో ఆదివాసీలు పెద్ద ఎత్తున నాగోబా దర్శించుకునేందుకు క్యూ కట్టారు. రేపటి నుండి గిరిజనేతరులు సైతం నాగోబాను దర్శించుకోనున్నారు. తెలంగాణతో పాటు జార్ఖండ్, ఛత్తీస్‌గడ్, మహారాష్ట్ర, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల నుండి తరలి వచ్చిన భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అదికారులు.