
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థలపై దృష్టి సారించింది. ఎన్నికల ముందు పార్టీలో చేరిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల లెక్కలు వేసుకొని బలం ఉన్న చోట్ల అవిశ్వాస తీర్మాణాలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్‌లో మెజారిటీ జడ్పీటీసీలు కాంగ్రెస్ పక్షాన చేరడంతో అవిశ్వాస తీర్మానం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుత ఛైర్‌పర్సన్ శాంతాకుమారిపై అవిశ్వాసానికి కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీలు పావులు కదుపుతున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరిన జెడ్పీటీసీలతో మెజారీటీ బలం సంపాదించారు. దీనికి తోడు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో జెడ్పీ పీఠం కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ వేగంగా అడుగులు వేస్తోంది.
20మంది జెడ్పీటీసీల సంఖ్య ఉన్న నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ ఎస్పీ జనరల్ రిజర్వడ్. ఎన్నికల ముందు జెడ్పీలో బీఆర్ఎస్ పార్టీకి 16, కాంగ్రెస్‌కు నలుగురు జెడ్పీటీసీల సంఖ్య బలం ఉండేది. మెజారిటీ ఉండడంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఊరుకొండ జడ్పీటీసీ శాంతాకుమారి ప్రస్తుతం జెడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. అయితే అసెంబ్లీ ఎన్నికల వేళ ఏడుగురు జెడ్పీటీసీలు బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో మొత్తం 11మంది సభ్యులు ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉండడంతో మెజారీటి మార్క్ ను క్రాస్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగియడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పూర్తిస్థాయిలో బలం ఉన్న తర్వాత బీఆర్ఎస్ పార్టీకి చెందిన జెడ్పీటీసీ ఎలా ఉంటారని జిల్లా కాంగ్రెస్ పార్టీలో చర్చ నడుస్తోంది. దీంతో ఆలస్యం చేయవద్దనే యోచనలో జెడ్పీటీసీలు వేగంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావులతో సైతం చర్చించారు. అవిశ్వాస తీర్మానం నోటీసును సైతం సిద్ధం చేశారు. త్వరలోనే జిల్లా కలెక్టర్‌ను కలిసి అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చేందుకు జెడ్పీటీసీలు సిద్ధమయ్యారు.
అవిశ్వాస తీర్మానంతో పాటు తదుపరి జెడ్పీఛైర్ పర్సన్ ఎవరు అనేదానిపై జెడ్పీటీసీలు మంత్రి జూపల్లితో చర్చించారు. అవిశ్వాసం అనంతరం ఎవరిని జెడ్పీ ఛైర్మన్ చేయాలన్న అంశంపైనా స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ సతీమణి అనురాధతో పాటు తెలకపల్లి జెడ్పీటీసీ సుమిత్ర జెడ్పీ ఛైర్పర్సన్ రేసులో ఉన్నట్లు సమాచారం. వీరిలో తెలకపల్లి జెడ్పీటీసీ సుమిత్రను జెడ్పీ చైర్ పర్సన్ గా ఎన్నుకునేందుకే మొగ్గుచూపుతున్నారని తెలుస్తోంది. ఇక అధికార పార్టీ అవిశ్వాసా తీర్మానానికి పలువురు బీఆర్ఎస్ జెడ్పీటీసీలు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు జెడ్పీటీసీలు సైతం కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్‌లో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. చూడాలి మరీ నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…