Hyderabad: బహదూర్‌పురా ఫ్లైఓవర్ కింద ఏదో అలజడి.. గుమిగూడిన జనం.. ఏంటా అని వెళ్లి చూడగా

నగరంలో రద్దీ అయిన ఫ్లై ఓవర్‌లో అదొక్కటి.. ఎప్పడూ జనాల రద్దీ అక్కడ ఎక్కువ ఉంటుంది. కానీ ఓ రోజు ఆ ఫ్లై ఓవర్ కింద ఏదో అలజడి రేగింది. ఒక్కసారిగా జనాలు గుమిగూడారు. ఏంటా అని వెళ్లి చూడగా.. దెబ్బకు షాక్

Hyderabad: బహదూర్‌పురా ఫ్లైఓవర్ కింద ఏదో అలజడి.. గుమిగూడిన జనం.. ఏంటా అని వెళ్లి చూడగా
Bahadurpura Flyover

Edited By: Ravi Kiran

Updated on: Jul 02, 2025 | 7:15 AM

హైదరాబాద్‌ బహదూర్‌పురా ఫ్లైఓవర్ కింద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దీంతో ఆ ప్రాంతంలో గత కొంతకాలంగా నెలకొన్న అసాధారణ పరిస్థితులు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. స్థానికులు చెబుతున్నదాని ప్రకారం ఈ ప్రాంతం గంజాయి సేవించేవారికి నిలయంగా మారిపోయిందంటున్నారు. ఫ్లైఓవర్ కింద, పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశాల్లో అనేక మంది యువకులు గంజాయి సేవిస్తూ గుమిగూడటం తరచూ కనిపించేది. వారి మధ్య తరచూ గొడవలు, పరస్పర దాడులు జరగడం ఇటీవలి కాలంలో సాధారణమైపోయింది. మద్యం, మత్తు పదార్థాల ప్రభావంలోనే ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

మృతుడి ఎవరనేది తెలియలేదని, అతడు ఈ గంజాయి గుంపులోనే ఒకడిగా భావిస్తున్నారు. మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. బహదూర్‌పురా పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాథమికంగా అది హత్యగా భావించి కేసు నమోదు చేశారు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేకపోవడం, ఎవరూ అతడిని గుర్తించకపోవడం దర్యాప్తును క్లిష్టతరం చేసింది. ప్రస్తుతం మృతదేహం పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరణానికి గల స్పష్టమైన కారణం తెలియకపోయినా, శరీరంపై ఉన్న గాయాలను పరిశీలించిన డాక్టర్లు అది హత్యేనని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సీసీటీవీ ఫుటేజ్, స్థానికుల వాంగ్మూలాలతో దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు గంజాయి బ్యాచ్‌తో మృతుడికి సంబంధం ఉందా.. లేదా ఏదైనా వివాదమే కారణమా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంత ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

రద్దీగా ఉండే బహదూర్‌పురా ఫ్లైఓవర్ కింద ఇలా హత్య జరగడం పట్ల స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లైఓవర్ కింద నిత్యం గంజాయి బ్యాచ్‌ తిరుగుతుండటంతో స్థానికులు రాత్రివేళ బయటకు రావడానికి కూడా భయపడుతున్న పరిస్థితి నెలకొంది. చాలాకాలంగా ఇది సమస్యగా ఉన్నప్పటికీ, పూర్తిస్థాయిలో చట్టపరంగా తగిన చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులు ఈ ప్రాంతాన్ని పూర్తిగా పర్యవేక్షణలోకి తీసుకుని గంజాయి బ్యాచ్‌లపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాల్సిన అవసరం ఉందంటున్నారు స్థానికులు. కేసును ఛేదించేందుకు అవసరమైన సమాచారం ఎవరికైనా అందుబాటులో ఉంటే, దయచేసి బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్‌కు తెలియజేయాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మృతుడి వివరాలు వెల్లడయ్యే వరకు పోలీసులు అతడి ఫోటోలను ఇతర పోలీస్‌స్టేషన్లతో, గల్లంతైన వ్యక్తుల నివేదికలతో సరిపోల్చే ప్రక్రియను కొనసాగిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి