
తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. సాధారణంగా అభ్యర్థులు భారీ ర్యాలీలు హంగామాతో నామినేషన్లు వేస్తుంటారు. కానీ, నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన ఓ అభ్యర్థిని చూసి ఎన్నికల అధికారులు షాక్ తిన్నారు. ఆ అభ్యర్థి నామినేషన్ దాఖలులో విశేషమేంటి..? ఎన్నికల అధికారులు ఎందుకు అవాక్కయ్యారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
సూర్యాపేటకు చెందిన లింగిడి వెంకటేశ్వర్లు 20 ఏళ్లకు పైగా లెక్చరర్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ప్రజాస్వామ్యం పట్ల అవగాహన కల్పించేందుకు ఆయన వార్డు నుంచి పార్లమెంటు సభ్యుడు వరకు ప్రతి ఎన్నికల్లోను పోటీ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే సూర్యాపేట మున్సిపాలిటీలో 14వ వార్డు నుంచి ప్రజా పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని భావించాడు. ఇందుకు తనదైన శైలిలో నామినేషన్ వేయాలని యోచించాడు.
నామినేషన్ దాఖలు చేసేందుకు ధరావత్ కింద 1250 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. 14వ వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేసేందుకు నామినేషన్ పత్రాలు, ఓ గోనెసంచితో నామినేషన్ కేంద్రానికి వచ్చాడు. లోపలికి వచ్చిన లింగిడి వెంకటేశ్వర్లను చూసి ఎన్నికల అధికారులు షాక్ తిన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు చెల్లించే 1250 రూపాయల డిపాజిట్‌ను చిల్లర నాణేలను తీసుకువచ్చాడు. దీంతో అధికారులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. లింగిడి వెంకటేశ్వర్లు గోనెసంచిలో తీసుకువచ్చిన చిల్లర నాణాలను అధికారులు లెక్కించి నామినేషన్‌ను తీసుకున్నారు. చిల్లర నాణాలను చెల్లించి నామినేషన్ ను దాఖలు చేశానని వెంకటేశ్వర్లు చెబుతున్నాడు.
రిటైర్డ్ ఉద్యోగి అయినందున వేరే ఆదాయమార్గం లేక రోజు ఒక రూపాయి బిళ్ళ చొప్పున పొదువు చేసానని, ఆ డబ్బులతో నామినేషన్ వేశానని వెంకటేశ్వర్లు తెలిపాడు. వార్డు ప్రజలు తనను ఆదరించాలని నిజాయితీగా ఓటు వేసి తనను గెలిపించాలని కోరుతున్నాడు.