Telangana: అర్ధరాత్రి ఘోరం.. ఇంటి మిద్దె కూలి ముగ్గురు చిన్నారులు సహా తల్లి దుర్మరణం..

| Edited By: Shaik Madar Saheb

Jul 01, 2024 | 12:18 PM

తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది.. ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ఇంటి మట్టి మిద్దె కూలి ముగ్గురు చిన్నారులతో సహా తల్లి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ వనపట్ల గ్రామంలో జరిగింది.. అర్ధరాత్రి నిద్రిస్తున్న వారిపై భారీ మట్టిదిబ్బలు పడటంతో..

Telangana: అర్ధరాత్రి ఘోరం.. ఇంటి మిద్దె కూలి ముగ్గురు చిన్నారులు సహా తల్లి దుర్మరణం..
Crime News
Follow us on

తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది.. ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ఇంటి మట్టి మిద్దె కూలి ముగ్గురు చిన్నారులతో సహా తల్లి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ వనపట్ల గ్రామంలో జరిగింది.. అర్ధరాత్రి నిద్రిస్తున్న వారిపై భారీ మట్టిదిబ్బలు పడటంతో గొడుగు భాస్కర్.. భార్య గొడుగు పద్మ, పిల్లలు తేజస్వీని(6), వసంత(6), రుత్విక్(4) అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. భాస్కర్ కు తీవ్ర గాయాలు కావడంతో జిల్లా అస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని అధికారులు తెలిపారు.

అసలేం జరిగిందింటే..

ఎప్పటిలాగే ఆదివారం రాత్రి భోజనం ముగించుకొని కుటుంబ సభ్యులు అందరూ నిద్రకు ఉపక్రమించారు. ముందు గదిలో గొడుగు భాస్కర్ తల్లిదండ్రులు పడుకోగా… రెండవ గదిలో భాస్కర్ తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి నిద్రించారు. అర్ధరాత్రి సుమారు రెండు గంటల సమయంలో ఒక్కసారిగా మిద్దె కూలీ మట్టి దిబ్బలు, దూలాలు వారిపై పడిపోయాయి. మట్టి దిబ్బల కిందే ముగ్గురు పిల్లలతో సహా తల్లి తుదిశ్వాస విడిచారు. మొదట తండ్రి భాస్కర్ సైతం ప్రాణాలు కోల్పోయాడని భావించారు. శరీరంలో కదలిక కనిపించడంతో స్థానికులు ఆయనకు సీపీఆర్ నిర్వహించారు. అనంతరం నాగర్ కర్నూల్ జిల్లా అస్పత్రికి తరలించారు. ప్రస్తుతం భాస్కర్ అక్కడే చికిత్స పొందుతున్నారు.

దీంతో వనపట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ముగ్గురు చిన్నారులు, తల్లి మరణించడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కళ్లముందే ఆడుకుంటు తిరిగే చిన్నారులు విగతజీవులుగా పడి ఉండడాన్ని తట్టుకోలేక గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు. భారీ వర్షానికి ఇంటి మిద్దె కూలినట్లు చెబుతున్నారు.

జిల్లా అస్పత్రిలో నలుగురు బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి పరామర్శించారు. చికిత్స పొందుతున్న భాస్కర్ కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున పరిహారం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

భారీ వర్షాలతో మట్టిమిద్దె బాగా తడిసిపోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు, గ్రామస్థులు అంచనా వేస్తున్నారు. ఇటువంటి మట్టె మిద్దెలు ఉన్నవాళ్లు, పురాతన ఇళ్లలో నివసించే వారు తక్షణమే ఖాళీ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..