Rain ALert: మరో నాలుగైదు రోజుల్లోనే నైరుతీ రాక.. నేడు, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు!

పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్ర కోస్తా, ఉత్తర తమిళనాడు తీరం సమీపంలో సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక రాగల మూడు గంటల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం..

Rain ALert: మరో నాలుగైదు రోజుల్లోనే నైరుతీ రాక.. నేడు, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు!
Monsoon To Reach Early Kerala

Updated on: May 21, 2025 | 7:58 AM

హైదరాబాద్, మే 21: రాగల 4,5 రోజులలో కేరళ భూభాగంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. ఈ నెల 21న తూర్పు మధ్య అరేబియన్ సముద్రంలో కర్ణాటక తీరానికి సమీపంలో ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడనుంది. తూర్పు మధ్య అరేబియన్ ప్రాంతంలో ఈ నెల 22 న అల్పపీడనంగా మారి క్రమేపీ ఉత్తర దిక్కుగా కదులుతూ బలపడే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్ర కోస్తా, ఉత్తర తమిళనాడు తీరం సమీపంలో సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు తెలంగాణ లోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు తెలంగాణలోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

బుధవారం (మే 21).. రాగల మూడు గంటలలో భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, మహబూబాబాద్, మెదక్, ములుగు నిర్మల్, పెద్దపల్లి వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కరీంనగర్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది.

ఇక ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే..

ఈ రోజు గరిష్టంగా ఆదిలాబాద్ లో 41.2, కనిష్టంగా మెదక్ లో 34.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. నిన్న ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, రామగుండంలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి..

ఇవి కూడా చదవండి

ఆదిలాబాద్.. 40.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు
నిజామాబాద్.. 39.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు
ఖమ్మం.. 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు
రామగుండం.. 38.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు
నల్లగొండ.. 37.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు
భద్రాచలం.. 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు
హనుమకొండ.. 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు
హైదరాబాద్.. 35.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు
మహబూబ్ నగర్.. 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు
మెదక్.. 34.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు

ఏపీలోనూ భారీ వర్షాలు.. పిడుగులు పడే ఛాన్స్

ఇక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వాతావరణం ఎలా ఉంటుందంటే.. వేగంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు నాలుగైదు రోజుల్లో కేరళను తాకనున్నాయి. సాధారణం కంటే వారం రోజులు ముందే నైరుతి రానుంది. బంగాళఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఏపీలో నేడు, రేపు వర్షాలు కురవనున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమ మీదుగా కర్ణాటక వరకు ఉపరితలద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో మంగళవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు కోస్తా, రాయలసీమల్లో వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. బాపట్ల జిల్లా రేపల్లెలో 90, విశాఖపట్నంలోని సాగర్నగర్ లో 75, కృష్ణా జిల్లా ఘంటసాలలో 71 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇక రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీ మల్లో అనేకచోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయని తెలిపిన ఐఎండీ తెలిపింది. కాగా, రానున్న రెండు రోజులు రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై, ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో గంటకు 40-50 కిలో మీటర్ల వేగంతో గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.