ఆయనో ప్రజా ప్రతినిధి.. నిత్యం ప్రజలతో మమేకమవుతూ బిజీగా ఉంటారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన తన మూలాలను మాత్రం మర్చిపోలేదు. అధికార దర్పానికి దూరంగా ఆ ఎమ్మెల్యే.. వ్యవసాయ పొలంలో పనిచేస్తూ రైతు కూలీతో కలిసిపోయారు. ఆ ఎమ్మెల్యే ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..! తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్.. సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. తుంగతుర్తి (ఎస్సీ) నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా 2023 ఎన్నికల్లో విజయం సాధించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ.. ఎమ్మెల్యే ప్రజా కార్యక్రమాలకు హాజరవుతూ నియోజకవర్గ ప్రజలకు మందుల సామేల్.. తలలో నాలుకల ఉంటారని కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో వానాకాలం సీజన్ ముగిసి.. యాసంగి సీజన్ వరి నాట్లు జోరుగా సాగుతున్నాయి. రైతు కుటుంబంలో జన్మించిన ఎమ్మెల్యే మందుల సామేల్‌కు వ్యవసాయం అంటే మక్కువ. కొన్నేళ్లుగా తనకున్న కొద్దిపాటి భూమితో పాటు ఇతరుల భూములను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. తాను ఎమ్మెల్యేనన్న ఆలోచనను పక్కన పెట్టి తన వ్యవసాయ పొలంలో సాధారణ రైతుగా అవతారం ఎత్తాడు. యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలం ధర్మారంలోని తన వ్యవసాయ క్షేత్రంలో ట్రాక్టర్‌తో పొలాన్ని దున్నాడు. పార చేత పట్టి గట్లను సరి చేశాడు. వ్యవసాయ కూలీలతో మమేకమై వరి నాట్ల కోసం కూలీలకు నారును అందించాడు. ప్రతి ఏటా వానాకాలం, యాసంగి సీజన్లలో ఎమ్మెల్యే మందుల సామేల్.. కూలీలతో కలిసి వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తుంటాడు. కూలీలతో కలిసి పొలంలో ట్రాక్టర్2తో దున్నడం, పారతో పనిచేయడం, అడుగు మందు చల్లడం, మహిళా కూలీలకు నాట్లు వేసేందుకు అవసరమైన నారును అందిస్తుంటారు. ఎమ్మెల్యే తమతో కలిసి పనిచేయడం చూసిన కూలీలు ఆయన వ్యవహారశైలిని అభినందించారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను మూలాలను ఎప్పటికీ మర్చిపోనని, రైతు లేనిదే రాజ్యం లేదని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి