Miss World 2025: మిస్ వరల్డ్ పోటీల్లో సుందరీమణులు ఏ వస్త్రాలు ధరిస్తారో తెలుసా..?

ప్రపంచ సుందరీమణులైన అందాల భామలకు ఆతిథ్యమిచ్చేందుకు హైదరాబాద్ సిద్ధమవుతోంది. ఇక్కడ 25 రోజులపాటు అందాల భామలు సందడి చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర పర్యాటక శాఖ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే సుందరిమణులు ధరించే వస్త్రాలపై అందరి దృష్టి నెలకొంది.

Miss World 2025: మిస్ వరల్డ్ పోటీల్లో సుందరీమణులు ఏ వస్త్రాలు ధరిస్తారో తెలుసా..?
Miss World 2025

Edited By: Balaraju Goud

Updated on: Apr 20, 2025 | 3:53 PM

ప్రపంచ సుందరీమణులైన అందాల భామలకు ఆతిథ్యమిచ్చేందుకు హైదరాబాద్ సిద్ధమవుతోంది. ఇక్కడ 25 రోజులపాటు అందాల భామలు సందడి చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర పర్యాటక శాఖ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే సుందరిమణులు ధరించే వస్త్రాలపై అందరి దృష్టి నెలకొంది. ఫ్యాషన్ ప్రపంచానికి ప్రతీకగా నిలిచే ఈ పోటీల్లో అందాల భామలు ఎలాంటి వస్త్రాలు ధరిస్తారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

72వ ఎడిషన్ మిస్ వరల్డ్-2025 పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు తెలంగాణ పర్యాటక శాఖ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ పోటీలు హైదరాబాద్‌లో మే నెల 7వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పోటీలకు 140 దేశాల నుంచి 3వేల మంది అందాల భామలు, విదేశీ ప్రతినిధులు హాజరవుతున్నారు. హైదరాబాద్ వేదికగా జరగనున్న మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు వేదికగా ఉపయోగించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యంగా పోచంపల్లి చేనేత ఇక్కత్ వస్త్రాలను ఫ్యాషన్ ప్రపంచానికి మరింత చేరువ చేసి, నేతన్నలకు అండగా నిలిచేందుకు ప్రణాళికలు సిద్ధంచేస్తోంది.

మే 15న పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలతో ర్యాంప్ వాక్

చేనేత ఇక్కత్ వస్త్రాలకు అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచిన భూదాన్ పోచంపల్లిని మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందాల భామలు మే 15వ తేదీన సందర్శించనున్నారు. ఇక్కడి చేనేత కార్మికులతో వారు ముఖాముఖి మాట్లాడుతారు. అనంతరం చేనేత మగ్గాలపై చేనేత డబుల్ ఇక్కత్, సింగిల్ ఇక్కత్ వస్త్రాల తయారీ ప్రక్రియలను పరిశీలిస్తారు. ప్రపంచ సుందరీమణులు పోచంపల్లి చేనేత ఇక్కత్ చీరలను ధరించి ర్యాంప్ వాక్ చేయనున్నారు. ఫ్యాషన్ ప్రపంచానికి ప్రతీకగా నిలిచే ఐరోపా దేశాల ప్రతినిధులు, అందాల భామలతో పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలను ధరింపజేసి తద్వారా ఇక్కడి వస్తాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలని యోచిస్తోంది. మిస్ వరల్డ్ ఈవెంట్లను నిర్వహించే సంస్థ పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల విశిష్టతను వీడియోగ్రఫీ చేస్తోంది. ఇప్పటికే అనేక ఫ్యాషన్ ఈవెంట్లకు వేదికగా నిలిచిన పోచంపల్లికి ఇప్పుడు మరోసారి ప్రపంచ సుందరీ మణులు వస్తుండడంతో ఈ ప్రాంతం అంతర్జాతీయంగా మరింత ఖ్యాతి పొందనుంది.

మిస్ వరల్డ్-2025 పోటీల్లో ‘చేనేత థీమ్’..

మిస్ వరల్డ్-2025 పోటీల్లో ‘చేనేత థీమ్’ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. పోటీల్లో భాగంగా నిర్వహించే ఫ్యాషన్ రౌండ్, సాంస్కృతిక ప్రదర్శనలు, ఇతర కార్యక్రమాల్లో పోటీదారులు చేనేత వస్త్రాలు ధరించనున్నారు. ఇందుకోసం సంప్రదాయ, ఆధునిక డిజైన్ల కలయికతో చేనేత ఇక్కత్ వస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. అంతేగాక మిస్ వరల్డ్ టాప్ మోడల్ అండ్ ఫ్యాషన్ ఫినాలేలో సైతం చేనేత వస్త్రాలు ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.

నాగార్జునసాగర్, యాదగిరిగుట్ట సందర్శన..

మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో హైదరాబాద్ తోపాటు పర్యాటక కేంద్రాలకు అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకొచ్చేందుకు పర్యాటక శాఖ ప్రణాళికలు రూపొందించింది. ఈ నేపథ్యంలో అందాల భామలు ఇక్కడి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలైన భూదాన్ పోచంపల్లి, యాదగిరిగుట్ట, నాగార్జున సాగర్ లోని బుద్ధ వనాన్ని సందర్శించనున్నారు. వచ్చే నెల 15న పోచంపల్లిని సందర్శించే ప్రపంచ సుందరీ మణులు, వివిధ దేశాల ప్రతినిధులు ఆధ్యాత్మిక నగరి యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహ స్వామిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 2గంటల వరకు ఈ పుణ్యక్షేత్రంలో ప్రపంచ సుందరీమణులు గడపనున్నారు. ప్రపంచ దేశాల బౌద్ధులను ఆకర్షించేందుకు నాగార్జు నసాగర్ లోని బుద్ధ వనాన్ని అందాల భామలు మే 12న దర్శించనున్నారు. బౌద్ధుల చరిత్ర, ఈ ప్రాంత ప్రాశస్త్యాన్ని వారు తెలుసు కోనున్నారు. వారికి ఇక్కడి బౌద్ధసంస్కృతిని పరిచయం చేయడం తోపాటు అంతర్జాతీయంగా పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందేలా తెలంగాణ పర్యాటక శాఖ ప్రత్యేక ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..