Mirchi High Rates: పచ్చి మిర్చి ఘాటెక్కింది. కొనాలంటే కళ్లలోంచి నీరు వస్తోంది. ప్రతికూల వాతావరణంతో మిర్చి దిగుబడి తగ్గిపోవడంతో రేటు అమాంతం సెంచరీ దాటేసింది. మార్కెట్‌లో కిలో పచ్చి మిర్చి వందకుపైనే పలుకుతోంది. వివరాల్లోకెళితే.. ఉమ్మడి కరీంనగర్‌జిల్లాలో పచ్చి మిర్చి ధరలు మండిపోతున్నాయి. నిత్యావసర వస్తువుగా మారిన పచ్చి మిర్చి ప్రతికూల వాతావరణంతో ఈ యేడాది సరైన దిగుబడి ఇవ్వలేదు. దాంతో ఇతర ప్రాంతాల నుంచి మిర్చి దిగుమతి చేసుకుంటున్నారు. కిలో పచ్చి మిర్చి ధర సెంచరీ దాటేసింది. మార్కెట్లలో మిర్చి లభించడం లేదు. దొరికిన కొన్ని మార్కెట్లలో నాణ్యత ఉండటం లేదు. పంట చేతికొచ్చే అవకాశం లేకపోవడంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
పెరిగిన పచ్చి మిర్చి ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనడమే కష్టంగా మారింది. హోటళ్లలో మిర్చి వినియోగాన్ని తగ్గించేశారు. మిర్చి బజ్జీల రేట్లను కూడా పెంచడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా మే, జూన్ నెలలో పచ్చిమిర్చి రేట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే గత నెల రోజులుగా వీటి ధర పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఎండలు మొదలు కావడంతో మిర్చి తోటలు కూడా చేతికి రావడం కష్టమే అంటున్నారు. రేట్లు మరింత పెరిగితే పరిస్థితేంటని వినియోగదారులు లబోదిబోమంటున్నారు. ఇక మార్కెట్లో మిర్చి తక్కువగా రావడంతో దళారులు కూడా కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచేస్తున్నారు. కాగా, పచ్చి మిర్చి ధరలు పెరగడంతో కొనడమే మానేశామని వినియోగదారులు అంటున్నారు. కేవలం పావుకిలో కొంటే మహా ఎక్కువేనని వాపోతున్నారు.
Also read:
Hyderabad: భాగ్యనగర వాసులకు ఇక ఢోకా లేనట్లే!.. అవసరమైన వారికి ఉచితంగా ఇచ్చేందుకు..