తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్.. రూ.700కోట్లతో బయో గ్యాస్ ప్రాజెక్ట్.. 1400 మందికి ఉపాది!
తెలంగాణ క్లీన్ ఎనర్జీలో రోల్ మోడల్‌గా నిలుస్తోంది రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సిద్దిపేటలో రూ.700 కోట్లతో జునో జౌల్ బయో ఫ్యూయల్స్ ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్రాజెక్టుకు ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. వ్యవసాయ వ్యర్థాలతో బయోఫ్యూయల్ ఉత్పత్తి ద్వారా ఇంధన దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించి, 1400 మందికి ఉపాధి కల్పించి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం అని ఆయన తెలిపారు.

క్లీన్ ఎనర్జీలో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిపేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. సర్క్యూలర్ ఎకానమీని ప్రోత్సహించడం ద్వారా అటు పారిశ్రామిక వృద్ధిని, ఇటు పర్యావరణ పరిరక్షణను సమన్వయం చేయాలన్నదే తమ లక్ష్యమని వివరించారు. సిద్దిపేట జిల్లా నుంగనూరు మండలం నర్మెట్టలో జునో జౌల్ బయో ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్” ఆధ్వర్యంలో రూ.700 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్ బయో గ్యాస్ (సీబీజీ) ప్రాజెక్ట్ కు ఆదివారం నిర్వహించిన భూమి పూజకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఇప్పటికీ మన దేశం సుమారు 90 శాతం ముడి చమురును, 60 శాతం ఎల్పీజీని విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలంటే క్లీన్ ఎనర్జీ నే కీలకమన్నారు. అందుకు గ్రామాలు ఇంధన కేంద్రాలుగా మారాలని, ఆ దిశగా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. పరిశ్రమలను కేవలం హైదరాబాద్ కే పరిమితం చేయకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా గ్రామాలకు విస్తరిస్తున్నామన్నారు. నర్మెట్టలో ప్రారంభించబోయే ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇక్కడి రైతులు కేవలం అన్నదాతలుగానే కాకుండా, దేశానికి ఇంధనాన్ని అందించే ఉర్జదాతలుగా చరిత్ర సృష్టిస్తారన్నారు.
మూడు దశల్లో క్లస్టర్ పద్ధతిలో నిర్మించబోయే 10 సీబీజీ ప్లాంట్లలో వరి గడ్డి, ఆవు పేడ, కోళ్ల వ్యర్థాలతో బయో ఫ్యూయల్ గ్యాస్ ఉత్పత్తి చేస్తారన్నారు. ఇక్కడ సుమారు 1400 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని, ఇందులో 30 శాతం మంది మహిళలే ఉంటారన్నారు. క్లీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
