రాష్ట్ర రాజధాని హైదరాద్‌లో డబుల్ బెడ్ రూం ఇళ్ల రెండో దశ పంపిణీ ఈ నెల 21న జరుగుతుందని.. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే ఈసారి 13,300 ఇళ్లను పేద ప్రజలకు అందిస్తామని పేర్కొన్నారు. మొదటి దశలో ఇటీవల 11,700 ఇళ్లను విజయవంతంగా పేదలకు అందిచామని చెప్పారు. ఇక రెండో దశ ఏర్పాట్లపై శుక్రవారం రోజున సచివాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యాలయంలో జరిగినటువంటి విస్తృత స్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి కేటీఆర్ ఈ అంశంపై వివరించారు. అత్యంత పారదర్శకంగా అర్హులను గుర్తిస్తున్నామని తెలిపారు. అలాగే మీడియా ముందు కంప్యూటర్ల ద్వారా లాటరీ తీసి లబ్ధిజారులను ఎంపిక చేస్తున్నట్లు పేర్కొన్నారు. పైరవీకారులు, అనర్హులకు లబ్ధిదారుల్లో చోటు ఇవ్వడం లేదని అన్నారు. అలాగే ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధుల పాత్ర కూడా ఉండదని అన్నారు. అర్హులకే ఇళ్లు అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే.. అత్యంత పకడ్బందీగా ఎంపిక విధానాన్ని రూపొందించామని పేర్కొన్నారు.
ఎక్కడైనా అనర్హులు జాబితాలో ఉన్నట్లు తెలిస్తే సంబంధిత అధికారులను ఉద్యోగం నుంచి తొలగించే స్థాయిలో చర్యలు తీసుకుంటామని అన్నారు. అయితే ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కలక్టర్లదేనని అన్నారు. ఏవైన సమస్యలు ఉంటే ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచనలు చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం నిర్మించిన ఇలాంటి డబుల్ బెడ్ రూం ఇళ్లు దేశంలో ఎక్కడా కూడా లేవని అన్నారు. 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఇళ్లను ఉచితంగా ఇచ్చే కార్యక్రమం తెలంగాణలో తప్పా.. మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా లేదని చెప్పారు. అలాగే హైదరాబాద్ నగరంలో నిర్మించిన లక్ష ఇళ్లకు ప్రభుత్వం 9,100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని అన్నారు. అయితే మార్కెట్లో చూసుకుంటే వాటి విలువ 50 వేల కోట్ల రూపాయల పైనే ఉంటుంది.
వాస్తవానికి ఒక్కో ఇంటి విలువ 50 లక్షల రూపాయలపైనే ఉంటుందని.. ఇంతటి విలువైన ఇళ్లను కేసీఆర్ ప్రభుత్వం నిరుపేదలకు ఉచితంగానే అందిస్తోందని చెప్పారు. అలాగే ఇంత పెద్ద కార్యక్రమాన్ని తొలిదశలోనే జీహెచ్‌ఎంసీ అధికారులు విజయవంతంగా పూర్తి చేశారని చెప్పారు. అలాగే హైదరాబాద్‌లో గృహలక్ష్మి పథకానికి కొన్ని మార్పులు చేయాలని మంత్రులు ఇటీవల సీఎం కేసీఆర్‌ను కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. సవరణలు చేసిన గృహలక్ష్మి కార్యక్రమం త్వరలోనే ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. అలాగే నోటరీ ఆస్తుల రెగ్యులరైజ్‌పై కూడా త్వరలోగే మార్గదర్శకాలు ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం జీవో 58,59 కింద పేదల ఇళ్లు క్రమబద్ధీకరణ చేస్తున్నామని అన్నారు. అలాగే ఆయా కార్యక్రమాల ద్వారా ప్రతి నియోజకవర్గంలో కనీసం 15 వేల నుంచి 20 వేల మంది లబ్ధి పొందారని అన్నారు. మూసీ నది పొడవునా ఉన్న ఆక్రమణలు తొలగించి.. నిరాశ్రయిలకు డబుల్ బెడ్‌రూ ఇళ్లు ఇస్తామని వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.