KTR: తెలంగాణ రాష్ట్రంలోని బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని ఉక్కు కంపెనీ అర్సెలార్ మిత్తల్‌ను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. కర్మాగారం ఏర్పాటుకు బయ్యారం అత్యంత అనుకూలమైందన, ఇనుప ఖనిజ(Iron) నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు, ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు అర్సెలార్ మిత్తల్ సంస్థ సీఈవో ఆదిత్య మిత్తల్(Aditya Mittal).. మంత్రి కేటీఆర్‌తో ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బయ్యారంలో ఉక్కు పరిశ్రమ గురించి చర్చించారు. స్థానిక యువతకు పెద్దఎత్తున ఉపాధి కల్పనతో పాటు అందుబాటులోని వనరుల సద్వినియోగం, ఉక్కు ఉత్పత్తి, ఎగుమతుల లక్ష్యంతో ప్రభుత్వం తరఫున ఉక్కు కర్మాగార ఏర్పాటుకు పెద్దఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాట్లు వెల్లడించారు.
ఏపీ విభజన చట్టంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. మాట నిలబెట్టుకోలేదని కేటీఆర్ ఈ సందర్భంగా అన్నారు. ప్రైవేటు రంగంలో పరిశ్రమను తెలంగాణలో స్థాపించేందుకు మిత్తల్ సంస్థ ముందుకు రావాలని ప్రభుత్వం తరఫున కోరారు. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం అమలులో ఉందని కేటీఆర్ వివరించారు. మెగా పరిశ్రమ హోదా కింద దేశంలో ఎక్కడా లేని విధంగా రాయితీలు ఇస్తామన్నారు. బయ్యారం జాతీయరహదారి, వరంగల్ జిల్లాలోని మామునూరు వద్ద విమానాశ్రయాన్ని పునరుద్ధరించే సన్నాహాల్లో ఉన్నామని, కొత్తగూడెం వద్ద కొత్త విమానాశ్రయ ప్రతిపాదన చేశామన్నారు. హైదరాబాద్ అల్లుడైన ఆదిత్య మిత్తల్ తెలంగాణకు మేలు చేసేందుకు చొరవ చూపాలని కేటీఆర్ కోరారు. దీనిపై సానుకూలంగా స్పందిస్తూ.. ప్రతిపాదనను పరిశీలిస్తామని, కంపెనీ తరఫున తెలంగాణకు ప్రత్యేక బృందాన్ని పంపుతామని మిత్తల్ తెలిపారు.
ఇవీ చదవండి..
Insurance Porting: ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అంటే ఏమిటి? దానిని ఎలా చేసుకోవాలి? ఇక్కడ తెలుసుకోండి..
Multibagger Returns: ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించిన టాటా షేర్.. 2 ఏళ్లలో మంచి రిటర్న్స్..