Minister ktr fire on bjp : టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము ఏ పార్టీకి లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీ రామారావు అన్నారు. ప్రజా సమస్యలు పట్టని ప్రతిపక్ష నేతలు ఏ మొహం పెట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్తున్నారని ఆయన ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా.. సిరిసిల్ల పద్మనాయక కల్యాణ మండపంలో జరిగిన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. చిన్న విజయాలకే ఎగిరెగిరి పడుతున్న బీజేపీ నేతలకు తగిన సమయంలో బుద్ధి చెప్తామన్నారు. సహనాన్ని పరీక్షించవద్దన్న కేటీఆర్… సమయం వచ్చినప్పుడు స్పందిస్తామన్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్న కేటీఆర్.. ఒకటి,రెండు సీట్లు రావడంతో ఎగిరి ఎగిరి పడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ బీజేపీ ఏర్పడ్డాయంటే అది కేసీఆర్ భిక్ష అని కేటీఆర్ మరో స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అనాటి ముఖ్యమంత్రులను ఉరికించిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీకి ఉందన్నారు. ఆ విషయాన్ని బీజేపీ నాయకులు మరిచిపోవద్దన్నారు కేటీఆర్.
ఈ 20 ఏళ్లలో అనేక ఘటనలు చూశామని. అన్ని పరిస్థితులను నిలదొక్కుకొని రాష్ట్రాన్ని సాధించి అధికారంలోకి వచ్చామన్నారు. రాష్ర్టాన్ని సాధించి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ నిలబెట్టారు అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసి పోరుబాటలో నడిచామని కేటీఆర్ గుర్తు చేశారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో నోరు తెరవని నేతలు.. ఆంధ్రా నాయకుల ముందు చేతులు కట్టుకుని మాట్లాడేవారన్నారు.
కేసీఆర్ పరిపాలనాదక్షుడు అని కేంద్రమంత్రులే కితాబు ఇచ్చారన్న కేటీఆర్.. వందశాతం సాగు, తాగునీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేంద్రం ప్రభుత్వమే చెప్పిందన్నారు. ఆనాడు కాంగ్రెస్ 9 గంటల కరెంట్ అని చెప్పి.. ఏ ఒక్క రోజు కూడా 6 గంటల కరెంట్ కూడా ఇవ్వలేదన్నారు. అర్ధరాత్రి కరెంట్ ఇచ్చి రైతుల ప్రాణాలతో చెలగాటమాడారు అని కేటీఆర్ మండిపడ్డారు. దేశవ్యాప్తంగా 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని స్పష్టం చేశారు. రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీలతో రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని తేల్చిచెప్పారు.
అలాగే, రాష్ట్రంలో పార్టీ సంస్థాగతంగా బలోపేతంపై ప్రతి కార్యకర్త దృష్టి పెట్టాలన్న కేటీఆర్.. ప్రతి గ్రామంలో అందర్నీ కలుపుకుపోవాలన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు విషయంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రభాగాన ఉండాలని స్థానిక కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి…. నకిలీ వార్తల నియంత్రణపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. ట్విట్టర్, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ