Telangana: మెడికల్‌ సీట్లలో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ.. కొత్త కాలేజీలపై మంత్రి హరీష్‌ రావు.

|

Mar 28, 2023 | 5:16 PM

ముఖ్యమంత్రి కేసీఆర్‌ వల్ల తెలంగాణలో వైద్య విద్య విప్లవం వచ్చిందన్నారు మంత్రి హరీష్‌ రావు. మారుమూల జిల్లాకు సైతం మెడికల్ కాలేజీలు వచ్చాయని, మెడికల్ సీట్లలో ఇప్పటికే తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని ఆయన అన్నారు. ప్రతి లక్ష జనాభాకు 19 ఎంబిబిఎస్ సీట్లు, 7 పీజీ సీట్లున్నాయని చెప్పుకొచ్చిన మంత్రి..

Telangana: మెడికల్‌ సీట్లలో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ.. కొత్త కాలేజీలపై మంత్రి హరీష్‌ రావు.
Ts Minister Harish Rao
Follow us on

ముఖ్యమంత్రి కేసీఆర్‌ వల్ల తెలంగాణలో వైద్య విద్య విప్లవం వచ్చిందన్నారు మంత్రి హరీష్‌ రావు. మారుమూల జిల్లాకు సైతం మెడికల్ కాలేజీలు వచ్చాయని, మెడికల్ సీట్లలో ఇప్పటికే తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని ఆయన అన్నారు. ప్రతి లక్ష జనాభాకు 19 ఎంబిబిఎస్ సీట్లు, 7 పీజీ సీట్లున్నాయని చెప్పుకొచ్చిన మంత్రి.. ఈ ఏడాది 9 మెడికల్ కాలేజీలతో సీట్ల సంఖ్య గణనీయంగా పెరుగనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేయనున్న 9 మెడికల్ కాలేజీలపై నిమ్స్‌ నుంచి సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి హరీశ్‌ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘కేంద్రం ఒక్క కాలేజీ ఇవ్వకున్నా, సొంత నిధులతో స్వరాష్ట్రంలో 21 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశాము. కొత్త మెడికల్ కాలేజీల పనులు వేగంగా కొనసాగించాలి. ఎన్ ఎం సి నిబంధనలు సంతృప్తి చెందేలా పనులు ఉండాల’ని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో.. మంత్రులు సత్యవతి రాథోడ్, అజయ్ కుమార్, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, హెల్త్ సెక్రెటరీ రిజ్వి, 9 జిల్లాల కలెక్టర్లు, స్థానిక ఎమ్మెల్యేలు, వైద్యాధికారులు, టి ఎస్ ఎం ఎస్ ఐ డి సి ఇంజినీర్లు పాల్గొన్నారు.

జూమ్ ద్వారా నిర్వహించిన ఈ సమీక్షలో మెడికల్ కాలేజీల వారీగా పనుల పురోగతి గురించి మంత్రి హరీశ్ రావు సమీక్ష చేశారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జూలై నాటికి తరగతులు ప్రారంభించేందుకు సిద్ధం కావాలన్నారు. అవసరమైన అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు భర్తీ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల సహకారంతో స్థానికంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకుంటూ, మెడికల్ కాలేజీల్లో అకాడమిక్ ఇయర్ ప్రారంభించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు.

ఈ సందర్భంగా హరీశ్‌ రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచనతో గతేడాది ఒకేసారి 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించి రికార్డు కొట్టగా, ఈ ఏడాది జనగాం, వికారాబాద్, ఖమ్మం, కామారెడ్డి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జూలై నుంచి తరగతులు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది కాబట్టి, విద్యార్థులకు అన్ని సదుపాయాలతో కూడిన హాస్టల్స్ వసతి విద్యార్థులు, విద్యార్థినులకు వేర్వేరుగా ఏర్పాటు చేయాలన్నారు.

తెలంగాణపై కేంద్రం వివక్ష..

ఇదిలా ఉంటే ఈ సందర్భంగా హరీశ్‌ రావు.. కేంద్ర ప్రభుత్వంపై కూడా విరుచుకుపడ్డారు. కేంద్రం 157 మెడికల్ కాలేజీలు ఇస్తే, తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకుండా వివక్ష చూపిందని, తెలంగాణ ప్రజలకు వైద్యంతో పాటు, వైద్య విద్యను చేరువ చేసేందుకు సొంత నిధులతో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ మీద ప్రేమ, తెలంగాణ అభివృద్ధి మీద ఆకాంక్ష ఉంది కాబట్టి, సీఎం కేసీఆర్ చేసి చూపిస్తున్నట్లు చెప్పారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, ఒక నర్సింగ్ కాలేజీ విధానం ప్రకటించి దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచింది అన్నారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో తెలంగాణ రాష్ట్రం మెడికల్ కాలేజీలకు, వైద్య విద్యకు హబ్ గా మారుతున్నదన్నారు. కేంద్ర వివక్ష చూపితే సీఎం కేసీఆర్ మాత్రం రాష్ట్రంలో వైద్య విద్య విప్లవానికి నాంది పలికారన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..