మిర్యాలగూడలో ఘోర విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి నిద్రలోనే ముగ్గురు సజీవదహనం
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో ఇంట్లో చెలరేగిన అగ్ని ప్రమాదంలో అమ్మమ్మతో పాటు ఇద్దరు మనవళ్లు సజీవదహనమయ్యారు. ఇప్పటికే కుటుంబాన్ని వెంటాడుతున్న వరుస విషాదాల మధ్య ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు మరింత వ్యాపించాయి.

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఓ మహిళతో పాటు ఆమె మనవడు, మనవరాలు సజీవ దహనమయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని కలాల్‌వాడ ప్రాంతంలో నివాసం ఉంటున్న వనం చంద్రకళ (45) తన ఇద్దరు మనవళ్లు లక్ష్మణ్ (16), ప్రణతి (14)లతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి తర్వాత ఇంట్లో విద్యుదాఘాతం సంభవించి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ఇంట్లో ఉన్న ముగ్గురూ బయటకు వచ్చే అవకాశం లేక చిక్కుకుపోయారు.
మంటలను గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అయితే మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో మంటలు మరింత ఉధృతమై ఇంటి మొత్తాన్ని ఆవరించాయి. ఈ ఘటనలో చంద్రకళ, లక్ష్మణ్, ప్రణతి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. పూర్తిగా కాలిపోయిన మృతదేహాలను వెలికి తీసి స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. డీఎస్పీ రాజశేఖర్‌రాజు, సీఐ నాగభూషణరావు తదితర అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కొన్నేళ్లుగా వెంటాడుతున్న విషాదాలు..
కాగా ఈ కుటుంబాన్ని గత కొన్నేళ్లుగా వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. చంద్రకళ భర్త సైదులు నెల రోజుల క్రితమే అనారోగ్యంతో మృతి చెందాడు. పెద్ద కుమార్తె ధనమ్మ భర్త కూడా పదేళ్ల క్రితం మరణించడంతో ఆమె ఇద్దరు పిల్లలతో తల్లిదండ్రుల వద్దే నివసిస్తోంది. జీవనోపాధి కోసం మూడు రోజుల క్రితం పుణెకు వెళ్లిన ధనమ్మకు ఈ విషాద వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
