ఇక నుంచి టికెట్ ఏదైనా ‘మీ టికెట్’ యాప్ ఒక్కటీ మీ దగ్గరుంటే చాలు. ఆర్టీసీ, మెట్రో టికెట్లు, తెలంగాణలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో దర్శనం, ఇతర సేవలు లభించనున్నాయి. ఇందుకు సంబంధించిన టికెట్లు, పార్కులు, ఇతర పర్యాటక స్థలాల్లో క్యూలైన్లలో నిరీక్షించాల్సిన అవసరం లేదు. ఒకే ఒక్క క్లిక్‌తో మీసేవ రూపొందించిన టికెట్ యాప్ లో ఎంట్రీ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. తెలంగాణ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ర్టానిక్స్ సర్వీసెస్ డెలివరీ(ఈఎస్డీ) రూపొందించిన అడ్వాన్స్‌స్డ్ ‘మీ టికెట్’ యాప్ ను ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు గురువారం(జనవరి 9) సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు.
ప్రజలకు సుపరిపాలన అందించాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం లక్ష్యమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. టెక్నాలజీ సాయంతో పౌర సేవలను ప్రజల ముంగిటకు చేరవేస్తున్నామన్నారు. ఈ ప్రక్రియలో సంబంధిత నిపుణులను భాగస్వామ్యం చేస్తున్న మంత్రి. అన్ని రకాల టికెట్ బుకింగ్స్ ను ఒకే ప్లాట్ ఫాంపైకి తెచ్చేందుకు వీలుగా ఈ యాప్ ను రూపొందించామని తెలిపారు. రాబోయే రోజుల్లో ఇలాంటి తరహా యాప్ లను మరిన్ని అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ఈ యాప్ లో తెలంగాణలోని 15 ప్రముఖ దేవాలయాలు, 129 పార్కులు, 54 బోటింగ్ ప్రదేశాలు, జూ, మెట్రో, ఆర్టీసీ, మ్యూజియాలు, ప్లే అండ్ ఎంటర్ టైన్ మెంట్ జోన్స్ కు సంబంధించిన టికెట్లను తీసుకోవచ్చని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
అంతేకాకుండా ఈ యాప్ ద్వారా జీహెచ్ఎంసీ పరిధిలోని కమ్యూనిటీ హాళ్లు, జిమ్ లు, స్పోర్ట్ కాంప్లెక్స్ లను బుకింగ్ చేసుకోవచ్చు. మీరు ఎంచుకున్న లొకేషన్ కు సమీప ప్రాంతాల్లోని చూడదగిన ప్రదేశాలుంటే.. ఆ సమాచారం కూడా యాప్ లో ఆటోమేటిక్ గా కనిపిస్తుందని మంత్రి తెలిపారు. ‘ఈ యాప్ ను చాలా సులువుగా వినియోగించుకోవచ్చు. యూపీఐ ద్వారా చెల్లింపులు చేయోచ్చు. ఇతర ప్లాట్ ఫాంల మాదిరిగా ఈ యాప్ లో అదనంగా ఎలాంటి ఛార్జీలను వసూలు చేయం’ అని మంత్రి వివరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..