Telangana: అయ్యో పాపం.. డెంగ్యూ కాటుతో యువకుడు మృతి.. గత కొన్నిరోజులుగా చికిత్స పొందుతూ..

| Edited By: Shaik Madar Saheb

Jul 29, 2024 | 7:06 PM

డెంగ్యూతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన తెలంగాణలోని మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు చాలా మంది విష జ్వరాల బారిన పడి తీవ్ర అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో.. కొద్ది రోజుల క్రితం జ్వరం బారిన పడిన ఓ యువకుడు.. నిన్న రాత్రి హైదరాబాద్ లో ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించాడు.

Telangana: అయ్యో పాపం.. డెంగ్యూ కాటుతో యువకుడు మృతి.. గత కొన్నిరోజులుగా చికిత్స పొందుతూ..
Young Man Dies Of Dengue
Follow us on

డెంగ్యూతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన తెలంగాణలోని మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు చాలా మంది విష జ్వరాల బారిన పడి తీవ్ర అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో.. కొద్ది రోజుల క్రితం జ్వరం బారిన పడిన ఓ యువకుడు.. నిన్న రాత్రి హైదరాబాద్ లో ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించాడు.. డెంగ్యూ లక్షణాలతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లాలోని చిన్న శంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన వెంకటేశం, సరస్వతి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.. పెద్ద కుమారుడు 17 సంవత్సరాల నిఖిల్ హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు.. గత నాలుగు రోజుల క్రితం జ్వరం వచ్చింది.. పరిస్థితి మరింత క్షీణించడంతో కుటుంబసభ్యులు అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న క్రమంలో నిఖిల్ కు ప్లేట్లెట్ కౌంట్ తగ్గడంతో తీవ్రఅస్వస్థతకు గురయ్యాడు.. చికిత్స అందించినప్పటికీ.. ఎలాంటి మార్పు రాలేదు.. ఈ క్రమంలో ఆదివారం రాత్రి చికిత్స పొందుతూ నిఖిల్ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. చేతికొచ్చిన కొడుకు మరణించడంతో తల్లిదండ్రులు వెంకటేశం, సరస్వతి గుండెలవిసేలా రోదించారు. వెంకటేశం టైలర్ పని చేస్తు కుటుంబాన్ని పోషిస్తున్నారు.. కాగా నిఖిల్ డెంగ్యూ పాజిటివ్ వల్ల మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి..

ఇదిలాఉంటే.. హైదరాబాద్ తోపాటు మెదక్ జిల్లాలో గత కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తుండటంతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. చేగుంట మండలం జత్రం తండాలో ఒక ఇంట్లో ముగ్గురికి డెంగీ లక్షణాలు ఉండడంతో జిల్లా వైద్యాధికారి సందర్శించి తండాలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మరోవైపు రామయంపేట మండలం సుతారిపల్లి గ్రామస్థులు చికెన్ గున్యాతో హాస్పిటల్ పాలయ్యారు. ఇలా జిల్లాలో అనేక గ్రామాల్లో జ్వరాలతో బాధపడుతూ ఆస్పత్రుల్లో అడ్మిట్ అవుతున్నారు… విష జ్వరాల బారిన పడకుండా అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. అయితే..సరైన విధంగా అవగాహన కల్పించకపోవడంతోనే విషజ్వరాలు పెరుగుతున్నాయని పలువురు విమర్శిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి