
ఇద్దరి ప్రాణ స్నేహితుల మధ్య జరిగిన చిన్న గొడవ.. చినికి చినికి గాలివానలా మారింది. చివరకు ఒకరి వాళ్లనొకరు చంపుకునే వరకు వెళ్లింది. ఆటోతో ఢీకొట్టి ఒకరిని హత్య చేస్తే.. ప్రతికారంగా మరొకరి తండ్రిని కిరాతకంగా చంపేసి వాగులో పడేశారు. చిన్నశంకరంపేట మండలం సురారంలో జరిగిన ఈ రెండు హత్యలు ప్రస్తుతం స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి.
వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సురారం గ్రామంలో పాత కక్షలు పడగవిప్పాయి. నిన్నటివరకు ప్రాణ స్నేహితులుగా తిరిగిన ఇద్దరు వ్యక్తులు.. నేడు ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకునే స్థాయికి చేరారు. సురారం గ్రామానికి చెందిన శ్రీధర్, ప్రభు గతంలో అత్యంత ఆప్తమిత్రులు. అయితే, ప్రభు బంధువుల నుంచి శ్రీధర్ ఈఎంఐ (EMI) పద్ధతిలో ఒక ఆటోను కొనుగోలు చేశాడు. కేవలం రెండు నెలల ఈఎంఐ బకాయిల విషయంలో ఇద్దరి మధ్య చిన్నగా మొదలైన గొడవ.. కాస్తా తీవ్ర శత్రుత్వంగా మారింది.
ఈ కక్షల నేపథ్యంలోనే గతంలో శ్రీధర్ పై ప్రభు హత్యాయత్నానికి కూడా ఒడిగట్టాడు.. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. ఈ గొడవ ఇలా ఉండగానే, శ్రీధర్‌కు వరుసకు చెల్లెలు అయ్యే యువతిని ప్రభు రెండో పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు మరింత ముదిరి,పగ ప్రతీకారాలుగా రూపాంతరం చెందాయి..ఈ క్రమంలోనే నిన్న ఇద్దరూ మాట్లాడుకుందామని ఫోన్లలో లోకేషన్లు షేర్ చేసుకున్నారు.
శ్రీధర్ తన బైక్‌పై చేగుంట మండలం అనంతసాగర్ వద్దకు రాగానే.. పొంచి ఉన్న ప్రభు, అతని స్నేహితులు ఆటోతో శ్రీధర్ బైక్‌ను బలంగా ఢీకొట్టారు.ఈప్రమాదంలో శ్రీధర్ అక్కడికక్కడే ప్రాణాలు విడవగా..ప్రభు,అతని గ్యాంగ్ అక్కడి నుంచి పరారయ్యారు.. శ్రీధర్ హత్య వార్త తెలియడంతో అతని కుటుంబ సభ్యులు ప్రతీకారంతో రగిలిపోయారు. ఎలాగైనా దెబ్బకు దెబ్బ తీయాలని భావించి.. ప్రభు తండ్రి యాదగిరిని కిడ్నాప్ చేసి కిరాతకంగా హత్య చేశారు.అనంతరం ఆధారాలు దొరక్కుండా యాదగిరి మృతదేహాన్ని మాసాయిపేట మండలం కొప్పులపల్లి గ్రామ శివారులోని హల్దీవాగులో పడేశారు.
24 గంటల వ్యవధిలోనే జరిగిన ఈ రెండు హత్యలతో మెదక్ జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.శ్రీధర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ఆసుపత్రికి, యాదగిరి శవాన్ని నర్సాపూర్ ఏరియా ఆస్ప్రత్రికి తరలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో సురారం గ్రామంలో భారీ పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.