మెదక్, అక్టోబర్ 11: ఆయనకు ఇంకా కాంగ్రెస్ టికెట్ కన్ఫర్మ్ కాకపోయినప్పటికి.. నియోజకవర్గంలో పర్యటనలు, విమర్శలతో దూకుడు పెంచారు. తన పాత మిత్రులపై విమర్శలకు పదును పెడుతున్నారు. మాటల యుద్ధానికి తెరలేపుతున్నారు. రెండు సార్లు మెదక్ ఎమ్మెల్యేగా గెలిచిన పద్మాదేవేందర్ రెడ్డిపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. నియోజకవర్గంలో పద్మాదేవేందర్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమి లేదని.. తమకు అవకాశం ఇస్తే మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పెడుతామని మైనంపల్లి హన్మంత్ రావు, ఆయన కుమారుడు రోహిత్ రావు పదే పదే తమ ప్రచారంలో చెబుతున్నారు.
అయితే మైనంపల్లి హన్మంత్ రావు చేస్తున్న కామెంట్స్ ను చాలా లైట్ తీసు కుంటున్నారట ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి. పదే పదే కామెంట్స్ చేస్తున్న వారి పై మీరు స్పందించాలంటూ అనుచరులు చేస్తున్న ఒత్తిడిని అసలు పట్టించుకోవడం లేదట పద్మాదేవేందర్ రెడ్డి. మెదక్ నియోజకవర్గం అభివృద్ధి జరిగిందంటే తన హయాంలోనే అనే విషయాన్ని పార్టీ శ్రేణులతో అంటున్నట్లుగా సమాచారం.
నియోజకవర్గ ప్రజలకు తాను చేసిన అభివృద్ధి తెలుసంటున్నారు ఎమ్మెల్యే.. అయిన మైనంపల్లి ఫ్యామిలీ టికెట్ కూడా కన్ఫర్మ్ అవుతుందో.. లేదో.. కూడా అనుమానం వ్యక్తం చేశారు. అలాంటి వారి గురించి మనం స్పందించడం కూడా నిరూపయోగం అని అన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇటీవలి కాలంలో మైనంపల్లి వర్గం ఎమ్మెల్యే కుటుంబాన్ని టార్గెట్ చేసి.. ఎమ్మెల్యే భర్త అవినీతి పరుడు అంటూ ప్రచారం చేస్తూ ఉంటే.. ఎమ్మెల్యే వర్గం దానికి కౌంటర్లు ఇస్తున్నారట..
మైనంపల్లిపై సెటైర్లు విసురుతున్నారు ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అనుచరులు. ఎన్నికలు రాగానే డబ్బు సంచులతో మెదక్ రాజకీయం చేయడానికి వచ్చారని.. ఇక్కడ డబ్బులు పనిచేయవని ప్రజల్లో పలుకుబడి కావాలని రివర్స్ కౌంటర్ వేస్తున్నారు. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం పెరగడంతో.. ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి తన కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసినట్లుగా సమాచారం. మైనంపల్లి అండ్ కో బ్యాచ్ ని పట్టించుకోవద్దని కార్యకర్తలకు సర్దిచెప్పినట్లుగా తెలుస్తోంది. అందరూ బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారని.. తొందరపడవద్దు అని హితబోధ చేసినట్లుగా తెలుస్తోంది.
ఇలా మెదక్ నియోజకవర్గంలో మైనంపల్లి, పద్మాదేవేందర్ వర్గాల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం..వీరు ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల నాటికి ఇంకా ఎలా ఉంటారో అని గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం