Telangana Politics: ఆయనెలా వస్తారు.. ఆయన్నెలా రానిస్తారు.. సంగారెడ్డి బీఆర్‌ఎస్‌ సీక్రెట్‌ మీటింగ్‌.. ఆయన ఎవరో తెలుసా..

ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఓ ప్రచారంపై సీరియస్‌గా చర్చించారు. ఆయనొస్తే పరిస్థితేంటన్నదానిపై డిస్కస్‌ చేశారు. ఒకవేళ అదే జరిగితే ఏం చేయాలన్నదానిపైనా ఓ నిర్ణయానికి వచ్చారు. జిల్లాలో చర్చనీయాంశమైన ఆ మీటింగ్‌ ఎవరికోసం? కారెక్కుతారని ప్రచారంలో ఉన్న ఆ కాంగ్రెస్‌ నేత ఎవరు? ఆ సీక్రెట్‌ మీటింగ్‌లో అసలేం చర్చించారు?

Telangana Politics: ఆయనెలా వస్తారు.. ఆయన్నెలా రానిస్తారు.. సంగారెడ్డి బీఆర్‌ఎస్‌ సీక్రెట్‌ మీటింగ్‌.. ఆయన ఎవరో తెలుసా..
Medak

Updated on: Jun 30, 2023 | 9:59 PM

ఒక్కసారిగా వేడెక్కింది సంగారెడ్డి రాజకీయం. ఇక్కడినుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఉన్న జగ్గారెడ్డి గులాబీ కండువా కప్పుకుంటారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేది జగ్గారెడ్డినే అన్న ప్రచారం పెరగటంతో అయోమయంలో ఉన్నారట సంగారెడ్డి అధికారపార్టీ నేతలు. ఆ ప్రచారంలో నిజమెంత ఉందోగానీ.. జగ్గారెడ్డి బీఆర్ఎస్‌లోకి వస్తే తమ పరిస్థితేంటని ముందే టెన్షన్‌పడిపోతున్నారట కొందరు నేతలు. ఆయన్ని పార్టీలోకి రానివ్వకుండా ముందస్తుగానే కార్యాచరణ రూపొందించే పనిలో పడ్డారట కొందరు సంగారెడ్డి బీఆర్‌ఎస్ నేతలు.

బీఆర్ఎస్‌లోకి జగ్గారెడ్డి రీ ఎంట్రీపై జరుగుతున్న ప్రచారంతో సంగారెడ్డిలోని ఓ ఫంక్షన్‌హాల్లో సీక్రెట్‌ మీటింగ్‌ పెట్టుకున్నారట కొందరు సీనియర్ లీడర్లు. సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలోని చాలా మంది నేతలు ఈ మీటింగ్‌కి వచ్చారని సమాచారం. వారిలో చాలామంది జగ్గారెడ్డి రాకని తీవ్రంగా వ్యతిరేకించారట. నియోజకవర్గ పరిధిలోని పార్టీ నేతల్లో ఎవరో ఒకరికి టికెట్ ఇవ్వాలే కానీ, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని ప్రోత్సహించడం మంచిదికాదన్న అభిప్రాయానికి వచ్చారట నేతలు. అధినాయకత్వానికి ముందే తమ మనసులోని మాట చెప్పాలనుకుంటున్నారట.

రాష్ట్ర హ్యాండ్‌లూమ్ చైర్మన్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌కే మొన్నటిదాకా సంగారెడ్డి బీఆర్ఎస్ టికెట్ వస్తుందని అంతా అనుకున్నారు. గతంలో ఓసారి జగ్గారెడ్డిపై గెలిచిన ప్రభాకర్‌.. 2018లో కొద్ది తేడాతో ఆయనపై ఓడిపోయారు. అప్పట్నించీ నియోజకవర్గంలో పార్టీకి పెద్దదిక్కుగా ఉంటున్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండటంతో ఓడిపోయినా ఎమ్మెల్యేకున్నంత ప్రాధాన్యం దక్కుతోందాయనకు. మరిప్పుడు బీఆర్ఎస్‌లోకి ఒకవేళ జగ్గారెడ్డి వస్తే చింతా ప్రభాకర్ పరిస్థితేంటన్న చర్చ పార్టీలో నడుస్తోంది. పార్టీలోకి కొత్తనేతలు వచ్చినా సరే.. టికెట్‌ మాత్రం ప్రభాకర్‌కే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట బీఆర్ఎస్ నేతలు. ఒకవేళ ఆయనకి ఇవ్వడం ఇష్టంలేకుంటే ఉన్న సీనియర్లలో ఒకరికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారు.

సంగారెడ్డి నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్స్ పార్టీకి కంచుకోట. 2014లోనూ జగ్గారెడ్డి కాంగ్రెస్‌నుంచే గెలిచారు. అయితే ఆ ఎన్నికల తర్వాత నియోజకవర్గ పరిధిలోని సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు చాలామంది బీఆర్ఎస్‌లో చేరారు. ఇందులో చాలా మంది తమ గ్రామాల్లో అభివృద్ధి జరగడం లేదని, జగ్గారెడ్డి అందుబాటులో ఉండరని.. ఇలా రకరకాల కారణాలతో అధికారపార్టీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు వారు కూడా జగ్గారెడ్డి మళ్ళీ బీఆర్ఎస్‌లో చేరితే ఆయనతో మళ్లీ కలిసి ఎలా పనిచేయాలని ప్రశ్నిస్తున్నారట.

మరో వైపు బీఆర్‌ఎస్‌లో చర్చనీయాంశమైన ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా సైలెంట్‌గా.. నియోజకవర్గనికి దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయనేదో పెద్ద ప్లాన్‌తోనే ఉన్నారన్నది సంగారెడ్డి నేతల అనుమానం. జూపల్లి, పొంగులేటి లాంటి నేతలు కాంగ్రెస్‌లో చేరుతుండటంతో కాంగ్రెస్‌నుంచి జగ్గారెడ్డిలాంటి లీడర్‌ని చేర్చుకోవాలన్న ఆలోచనతో అధినాయకత్వం ఉందన్న వార్తలతో ముందే అలర్టయిందట సంగారెడ్డి బీఆర్ఎస్ టీం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం